కొత్తరకం కరోనా(స్ట్రెయిన్) కేసులతో అల్లాడుతున్న బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నాటికి దేశంలోని వయోజనులందరికీ(18 ఏళ్లు నిండినవారు) కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు వేయాలని నిర్దేశించుకుంది. మరిన్ని టీకా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధమవుతోందని బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డామ్నిక్ రొబాబ్ తెలిపారు. తద్వారా నిరంతర వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నెలకొల్పుతామని చెప్పారు.
వారి తర్వాతే..
ఆరోగ్య సిబ్బంది, కరోనా యోధులతో పాటు 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ మొదటి డోసు వేసేందుకు బ్రిటన్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయనుంది. అయితే.. బ్రిటన్ జనాభాలో దాదాపు 60 శాతం మందికి పైగా వయోజనులే ఉండటం గమనార్హం. వైరస్ వ్యాప్తి పెరుగుదలపై ఆ దేశ జాతీయ ఆరోగ్య సేవల(ఎన్హెచ్ఎస్) సంస్థ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ విస్తృత స్థాయి వ్యాక్సినేషన్ కార్యక్రమానికి బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ దేశంలో ప్రతి 30 సెకన్లకు ఓ కరోనా కేసు నమోదవుతోందని ఎన్హెచ్ఎస్ పేర్కొంది.