కొత్త స్ట్రెయిన్ వెలుగు చూశాక బ్రిటన్లో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజే ఏకంగా 50వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 53,135 మందికి కరోనా సోకినట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు. మహమ్మారి వ్యాప్తి ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
మున్ముందు మరింత తీవ్రం!
వైరస్ మరింత విస్తరించనుందని ఆరోగ్య సలహాదారుడు ప్రొఫెసర్ ఆండ్రూ హేవార్డ్ హెచ్చరించారు. ప్రముఖ రేడియో ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టే చర్యలను ఇంకా పటిష్ఠం చేయాలని సూచించారు. రానున్న విపత్తును దృష్టిలో ఉంచుకుని ఆంక్షలు కట్టుదిట్టం చేయాలన్నారు.
మహమ్మారి విజృంభణపై నేషనల్ హెల్త్ సర్వీస్ కూడా హెచ్చరించింది. ఆంక్షలపై వైద్య శాఖ మంత్రి మ్యాట్ హాన్కాక్ బుధవారం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.