బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ సేవకుల్లో ఒకరికి కరోనా సోకినట్లు సమాచారం. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలిందని నిర్ధరించారు అధికారులు. బాధితుడు రాణికి సన్నిహితంగా మెలిగాడో లేదో తెలియదని సమాచారం. ఈ నేపథ్యంలో ఎలిజబెత్ రాణికి కరోనా సోకే అవకాశాలపై సందిగ్ధం నెలకొంది. అయితే సిబ్బంది అందరితోనూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని రాజప్రాసాద అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన స్వీయ నిర్బంధంలో ఉంటున్నారని తెలిపారు.
"రాణి ఎలిజబెత్ విండ్సర్ విడిదికి వెళ్లే ముందు అక్కడ సిబ్బందిలో ఒకరికి వైరస్ సోకింది. కానీ అక్కడ 500మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఏ కార్యాలయంలోని వారినైనా అతడు కలిసేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజప్రాసాదంలోని ఏదో ఒక ప్రాంతం ప్రభావితమయ్యే అవకాశం ఉంది."
-రాజకుటుంబ ప్రకటన