తెలంగాణ

telangana

ETV Bharat / international

నేడే బ్రిటన్ ఎన్నికలు- హంగ్​ తప్పదంటున్న సర్వేలు! - yougov survay

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. నేడు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య ఓటింగ్ జరగనుంది. ప్రచారం ముగిసినందున ప్రీపోల్ సర్వేలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 'యూగవ్' నిర్వహించిన సర్వేలో కన్జర్వేటివ్ పార్టీకి స్వల్ప ఆధిక్యం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంట్​లో హంగ్ ఏర్పడే అవకాశాలను కొట్టిపారేయలేని పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తులు సత్తా చాటే అవకాశం ఉంది.

UK polls: PM Boris Johnson holds on to lead but hung Parliament within margin
నేడే బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు- హంగ్​ తప్పందంటున్న సర్వేలు!

By

Published : Dec 12, 2019, 5:46 AM IST

Updated : Dec 12, 2019, 11:28 AM IST

నేడే బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు- హంగ్​ తప్పదంటున్న సర్వేలు!

బ్రిటన్​ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడింది. చివరి రోజు ప్రచారంలో భాగంగా అభ్యర్థులందరూ ఓటర్లను ఆకర్షించడానికి వివిధ ప్రయత్నాలు చేశారు. ప్రధాని బోరిస్ జాన్సన్​కు స్వల్ప ఆధిక్యం లభించే అవకాశం ఉందని ఎన్నికల ముందు నిర్వహించిన సర్వేలో తేలింది. అయితే పార్లమెంట్​లో హంగ్​ ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత ఎన్నికల్లో 650 పార్లమెంట్ దిగువ సభ స్థానాలకు (హౌస్​ ఆఫ్ కామన్స్) 3,322 మంది బరిలో నిలిచారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగే అంశంపై తాజా ఎన్నికలు కీలక ప్రభావం చూపనున్నాయి. కన్జర్వేటివ్ పార్టీకి ఆధిక్యం లభిస్తే ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియను మరింత ముమ్మరం చేసే అవకాశం బోరిస్ జాన్సన్​కు మెరుగుపడుతుంది. బ్రెగ్జిట్​ ప్రక్రియ వెంటనే ముగించాలనే అంశంతో ప్రధానంగా బోరిస్ ఎన్నికలకు వెళ్తుండగా... మరోసారి ఈ అంశంపై రిఫరెండంను నిర్వహించడమే అజెండాగా ప్రతిపక్షాలు ముందుకు వెళ్తున్నాయి. రిఫరెండంతో పాటు ప్రాంతీయ అంశాలైన జాతీయ వైద్య సేవలు వంటి పథకాలపై శ్రద్ధ కనబరుస్తున్నాయి.

బ్రిటన్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. రాత్రి 10 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. తుది ఫలితాలను అంచనా వేసే ఎగ్జిట్ పోల్స్ ఎన్నికలు ముగిసిన తర్వాత వెలువడనున్నాయి.

'యూగవ్' ప్రీపోల్ సర్వే..

ఎన్నికలకు ముందు వెలువడిన పోల్ సర్వేలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ ఆధిక్యం లభించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. పోలింగ్ ఫలితాలను అంచనా వేస్తూ 'యూగవ్' నిర్వహించిన సర్వేలో కన్జర్వేటివ్ పార్టీ 339 స్థానాలు కైవసం చేసుకోనున్నట్లు పేర్కొంది. గత వారం రోజులుగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఫలితాలు వెల్లడించింది. ప్రతిపక్ష లేబర్​ పార్టీకి 231, డెమొక్రాట్లకు 15, స్కాటిష్ నేషనల్ పార్టీకి 41 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 650 స్థానాలున్న బ్రిటన్ పార్లమెంట్​ దిగువ సభలో ఆధిక్యానికి 326 స్థానాలు అవసరం. రెండు వారాల క్రితం జరిగిన సర్వేలో కన్జర్వేటివ్ పార్టీ 68 స్థానాల ఆధిక్యం కనబర్చగా... ప్రస్తుతం ఆ ఆధిక్యం 13కు పడిపోయింది. దీంతో బ్రిటన్ పార్లమెంట్​లో హంగ్​ ఏర్పడే అవకాశాలు కొట్టిపారేయలేమని యూగవ్ తెలిపింది. కచ్చితమైన ఫలితాలు అంచనా వేయడానికి 'మల్టీ లెవల్ రిగ్రెషన్ అండ్ పోస్ట్ స్ట్రాటిఫికేషన్'(ఎంఆర్​పీ) విధానాన్ని యూగవ్ అవలంబించింది. ఈ విధానం ద్వారా 2017లో జరిగిన ఎన్నికల ఫలితాలను సరిగ్గా అంచనా వేయడం గమనార్హం.

భారతీయ గెలుపు గుర్రాలు

ఈ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు సత్తా చాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2017లో జరిగిన ఎన్నికల్లో 12 మంది భారత సంతతి వ్యక్తులు పార్లమెంట్​కు ప్రాతినిధ్యం వహించగా.... ఈ సారి ఆ సంఖ్య పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కన్జర్వేటివ్, లేబర్ పార్టీల నుంచి ఆయా పార్టీలకు పట్టున్న స్థానాల్లో భారత సంతతి అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారి గెలుపు లాంఛనమేనని తెలుస్తోంది.

ఇదీ చూడండి: అయోధ్య తీర్పు రివ్యూ పిటిషన్లపై రేపు సుప్రీం అంతర్గత విచారణ

Last Updated : Dec 12, 2019, 11:28 AM IST

ABOUT THE AUTHOR

...view details