బ్రిటన్లో మాస్కులు ధరించడం సహా.. కరోనా కట్డడికి విధించిన అధికారిక నిబంధనలన్నింటినీ జులై 19 నుంచి ఎత్తివేసే యోచనలో ఉన్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి బోరీస్ జాన్సన్ సోమవారం ప్రకటించారు. తద్వారా.. కరోనా మార్గదర్శకాలను పాటించాలా? వద్దా? అనేదానిపై ప్రజలే స్వీయ నిర్ణయం తీసుకునే దిశగా మార్గం సుగమం చేశారు. అయితే.. తన ఈ ప్రకటనను బట్టి కరోనా అప్పుడే ముగిసిపోయిందని భావించరాదని బోరిస్ హెచ్చరించారు.
కరోనా బారినపడుతున్న వారి సంఖ్య, ఆస్పత్రుల్లోని సమాచారం ఆధారంగా.. కరోనా నిబంధనలను ప్రజలు పాటించే అంశంపై వచ్చే సోమవారం తుది నిర్ణయం తీసుకుంటామని బోరిస్ తెలిపారు. అయితే.. దీర్ఘకాలంపాటు ఇంటి నుంచి పని, మాస్కులు ధరించడం వంటి వాటిని తప్పనిసరి చేయబోరని తెలుస్తోంది.
"వైరస్ నుంచి టీకాలు రక్షణ కల్పిస్తున్నప్పటికీ.. రాబోయే వారాల్లో సాధారణ పరిస్థితుల్లోకి రాకపోతే.. ఇంకెప్పుడు సాధారణ స్థితికి వస్తాం అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. టీకా పంపిణీ వల్ల కరోనాతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య తగ్గింది."