ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశం జరుపుకొంటున్న గణతంత్ర వేడుకలకు అతిథిగా హాజరయ్యే అవకాశం చేజారినందుకు బ్రిటన్ ప్రధాని ఒకింత విచారం వ్యక్తం చేశారు. అయితే, త్వరలో భారత్‌కు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా యావత్ భారత ప్రజానీకానికి ఆయన 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు.
పరస్పర సహకారంతో..
"భారత్‌లో జరిగే విశిష్ట వేడుకలకు(గణతంత్ర దినోత్సవం) నా మిత్రుడు ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు హాజరవ్వాలని ఆసక్తిగా వేచిచూశాను. కానీ, కొవిడ్-19పై మనమంతా చేస్తున్న పోరాటం కారణంగా వేడుకలకు దూరంగా ఉండాల్సి వచ్చింది" అంటూ జాన్సన్ విచారం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిపై ఇరు దేశాలు ఉమ్మడిగా చేస్తున్న పోరును ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. మానవాళికి పొంచి ఉన్న మహమ్మారి ముప్పు తొలగించేందుకు చేస్తున్న వ్యాక్సిన్ల తయారీలో ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకు వెళుతున్నాయని తెలిపారు. త్వరలో కరోనాపై పోరులో విజయం సాధించబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీతో గతంలో కుదిరిన ఒప్పందం మేరకు ఉభయ దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు త్వరలో భారత్‌కు వచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నారు. కరోనా కారణంగా ప్రజలంతా దూరంగా ఉండాల్సి వస్తోందని గుర్తుచేశారు. బ్రిటన్, భారత్‌కు మధ్య వారధిగా ఉన్న అనేక మంది ప్రవాస భారతీయులు సైతం ఒకరికొకరు కలుసుకోలేకపోతున్నారన్నారు.