బ్రెగ్జిట్ ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంటు ఆమోదం బ్రెగ్జిట్ ఒప్పందానికి ఎట్టకేలకు బ్రిటన్ పార్లమెంటు ఆమోదం లభించింది. ఐరోపా సమాఖ్య నుంచి తమ దేశ నిష్క్రమణకు చట్టసభ సభ్యులు పచ్చజెండా ఊపారు. దిగువ సభలోని ఎంపీలు ఇప్పటికే ఈయూ ఉపసంహరణ ఒప్పంద బిల్లుకు మద్దతు తెలిపారు. అంతే కాకుండా గతేడాది బ్రసెల్స్‌తో ప్రధాని బోరిస్ జాన్సన్ కుదుర్చుకున్న డైవర్స్ ఒప్పందానికీ ఎగువ సభ ఆమోదం లభించింది.
అయితే ఎగువ సభ ఈ విషయంలో కొన్ని మార్పులు చేసింది. బ్రెగ్జిట్ నేపథ్యంలో ఈయూ పౌరులు, పిల్లల శరణార్థుల హక్కులను అందులో చేర్చింది. ఈ ఒప్పందంపై బుధవారం జరిగిన ఓటింగ్‌లో అత్యధిక మెజారిటీ సభ్యులు కలిగిన జాన్సన్ ప్రభుత్వం ఐదు సవరణలను తిరస్కరించింది. బ్రెగ్జిట్‌పై అధికార ధ్రువీకరణకు ప్రస్తుతం క్వీన్ ఎలిజబెత్ 2 అంగీకారం తెలపాల్సి ఉంది. ఇది పూర్తైతే జనవరి 31న బ్రిటన్ ఈయూ నుంచి వైదొలిగేందుకు మార్గం సుగమం అవుతుంది.
బోరిస్‌కు ఘన విజయం..
వచ్చేవారం యురోపియన్ పార్లమెంటు ఈ ఒప్పందానికి మద్దతు తెలపాల్సి ఉంది. అదే జరిగితే లండన్‌లో ఇది ఓ చారిత్రక ఘట్టంగా మిగిలిపోతుంది. ఎందుకంటే 28 సభ్య దేశాలు కలిగిన ఈయూ నుంచి వైదొలగిన తొలి దేశంగా బ్రిటన్ నిలుస్తుంది. జాన్సన్‌కు తాను పదవి చేపట్టిన కాలంలో ఇదో పెద్ద విజయం అవుతుంది.
మాజీ ప్రధాని థెరిసా మే 2018లో బ్రెగ్జిట్ ఒప్పందంపై చర్చలు జరిపారు. దిగువ సభ ఈ విషయాన్ని మూడుసార్లు తిరస్కరించింది. థెరిసా రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బోరిస్... బ్రెగ్జిట్‌ను సాకారం చేసేందుకు చాలా కృషి చేశారు. మెజారిటీ లేకపోవడం వల్ల గతనెలలో ఎన్నికలకు వెళ్లారు. జాన్సన్ అధిక మెజారిటీతో అధికారాన్ని చేపట్టారు. ఆ తర్వాత ఎంపీలు ఈ ఒప్పందానికి మద్దతు పలికారు.
బ్రెగ్జిట్ లాభం ఎవరెవరికి?
బ్రెగ్జిట్ ఒప్పందం జరిగితే ఐరోపా సమాఖ్య పౌరుల హక్కులకు రక్షణ లభిస్తుంది. బ్రిటన్ ప్రావిన్స్ ఆఫ్ నార్తర్న్ ఐర్లాండ్ కోసం ప్రత్యేక వాణిజ్య ఏర్పాటు జరుగుతుంది. యూకే, ఈయూ అప్పులు కూడా పరిష్కారమవుతాయి.