కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దుకు వ్యతిరేకంగా బ్రిటన్‌లో విపక్ష లేబర్ పార్టీ నిరసన గళాన్ని వినిపించింది. కశ్మీర్ అంశంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని అత్యవసర తీర్మానాన్ని ఆమోదించింది. అంతర్జాతీయ పరిశీలకులు కశ్మీర్లో పర్యటించి.. ప్రజల హక్కుల కోసం పోరాడాలని పేర్కొంది.
కశ్మీర్ అంశం భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉన్న ద్వైపాక్షిక వ్యవహారమని అధికారికంగా బ్రిటీష్ ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఇందుకు వ్యతిరేకంగా బ్రిగ్టన్ వేదికగా జరిగిన వార్షిక సమావేశంలో లేబర్ పార్టీ కశ్మీర్‌పై తీర్మానించింది. కశ్మీర్ అంశమై లేబర్ పార్టీ నుంచి ఒక ప్రతినిధిని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమాఖ్య వద్దకు పంపించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆ పార్టీ నేత జెరెమీ కార్బిన్.
"కశ్మీర్‌ను వివాదాస్పద సరిహద్దుగా పరిగణించి.. తీర్మానాల ప్రకారం ఆ ప్రాంత ప్రజలకు స్వయం నిర్ణయాధికారం ఇవ్వాలి. కశ్మీర్ ప్రజలకు అండగా మా పార్టీ ఉంటుంది. సామాజిక న్యాయం, నైతిక విదేశాంగ విధానం కోసం మా పార్టీ కట్టుబడి ఉంటుంది."
-- లేబర్ పార్టీ తీర్మానం.