ప్రపంచ దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 85 లక్షల 70 వేలకు చేరువైంది. ఇప్పటివరకు 12 లక్షల 33 వేలమందికి పైగా మహమ్మారి ధాటికి బలయ్యారు.
ఇప్పటికే కొన్ని దేశాధినేతలు కరోనా బారినపడి కోలుకున్నారు. తాజాగా స్వీడన్ ప్రధాని స్టీఫన్ లోఫ్వెన్ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయనకు సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తికి కరోనా పరీక్షలో నెగిటివ్ వచ్చినప్పటికీ.. లోఫ్వెన్ హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. వీలైనంత త్వరలో కరోనా టెస్ట్ చేయించుకుంటానని తెలిపారు లోఫ్వెన్.
కఠిన చర్యలే..
విపరీతంగా కరోనా కేసులు నమోదు కావడం వల్ల రెండో లాక్డౌన్ విధించింది బ్రిటన్. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రెండోసారి విధించిన లాక్డౌన్ను ఉల్లంఘిస్తే భారీగా జరిమానా విధించడమే కాకుండా.. కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండి కరోనా వ్యాప్తి నియంత్రణకు సాయపడాలని అధికారులు సూచించారు. ఈ లాక్డౌన్ డిసెంబర్ 2 వరకు అమల్లో ఉంటుంది.