కొవిడ్ -19 లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి, సహాయకురాలిని ముద్దు పెట్టుకోవడంపై దుమారం చెలరేగడంతో బ్రిటన్ ఆరోగ్య మంత్రి మ్యాట్ హాంకాక్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు . ఈ మహమ్మారి సమయంలో ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలకు ప్రభుత్వం రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. సన్నిహిత కుటుంబ సభ్యులు కానివారితో భౌతిక దూరం పాటించాలన్న ప్రభుత్వ నిబంధనను ఉల్లంఘించినందుకు మరోసారి క్షమాపణ చెప్పారు. హాంకాక్.. బ్రిటన్ ఆరోగ్య, సామాజిక భద్రత కార్యాలయంలో గినా కొలాడాంగెలోను ముద్దు పెట్టుకోవడం సీసీటీవీ దృశ్యాల్లో నమోదైంది.
"ఆరోగ్యం, సామాజిక సంరక్షణ మంత్రిగా రాజీనామా చేసి ప్రధానికి సమర్పించాను. దేశంలో ప్రతీఒక్కరూ చేసిన కృషి, అపారమైన త్యాగాలను నేను అర్థం చేసుకోగలను. చట్టాలు చేసే వారు కూడా వాటికి కట్టుబడి ఉండాలి. అందుకే నేను రాజీనామా చేయాల్సి వచ్చింది."
-హాంకాక్, బ్రిటన్ మాజీ ఆరోగ్యమంత్రి