జన్యుమార్పిడి జరిగిన కరోనాతో కొద్దిరోజులుగా సతమతమవుతోందన్న బ్రిటన్‌కు మరో కొత్త బెడద ముంచుకొచ్చింది. దక్షిణాఫ్రికాలో మార్పు చెంది అక్కడ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న ఇంకో కొత్త రకం కొవిడ్ వైరస్ తాజాగా లండన్‌కు చేరుకుంది. ఇద్దరు పౌరులు ఇప్పటికే దీని బారినపడినట్లు బ్రిటన్ ఆరోగ్య మంత్రి మట్ హన్‌కాక్ బుధవారం వెల్లడించారు. కొత్త రకం కరోనా(వియుఐ202012/01)ను మించిన వేగంతో వ్యాపించే లక్షణాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వైరస్‌కు ఉన్నాయని, ఉత్పరివర్తనం కూడా త్వరత్వరగా జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని వారాల క్రితం దక్షిణాఫ్రికాకు వెళ్లి వచ్చిన వారి ద్వారా ఇది తమ దేశానికి చేరి ఉంటుందని తెలిపారు. కొత్త రకాల వైరస్ వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరించి, ఆంక్షలను కఠినంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికుల రాకపోకలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
గత 15 రోజుల్లో దక్షిణాఫ్రికాకు వెళ్లి వచ్చిన వారు వెంటనే స్వీయ ఏకాంతంలోకి వెళ్లాలని సూచించారు. దక్షిణాఫ్రికా రకం వైరస్‌పై వాయవ్య ఇంగ్లాండ్‌లోని ప్రత్యేక ప్రయోగశాలలో పరీక్షలు చేయనున్నారు. బ్రిటన్‌లో బుధవారం ఒక్కరోజే 36 వేల మందికి పైగా వైరస్ బారినపడ్డారు.
ఇదీ చూడండి: 'కొత్త' వైరస్ వేళ.. 'క్రిస్మస్'పై ఆంక్షలు ఏ దేశంలో ఎలా?