బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ కలకలం రేపుతోంది. రోజువారీ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గత 5 రోజులుగా రోజుకు సగటున 50వేలకుపైగా కేసులు వెలుగుచూస్తున్నాయి. శనివారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 57,725 మంది కొవిడ్ బారినపడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 26లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు అక్కడ సుమారు 75వేల మంది కొవిడ్‌కు బలయ్యారు. అయితే.. రానున్న రోజుల్లో మరణాల సంఖ్య మరింత పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
కొత్త రకం కరోనా వైరస్.. లండన్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో.. అక్కడి పాఠశాలలను మరో రెండువారాల పాటు మూసివేయాలని ప్రభుత్వాన్ని కోరాయి ఉపాధ్యాయ సంఘాలు. విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళనల నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేశాయి. కనీసం మరో 14 రోజుల పాటు ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు అనుమతి కోరుతూఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను అభ్యర్థించాయి.