కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత్ తరహాలో బ్రిటన్ ప్రభుత్వమూ లాక్డౌన్ విధించింది. అయితే, ఇంట్లో కూర్చుని కొవిడ్-19ను తలచుకుంటూ బెంబేలెత్తిపోకుండా.. ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా.. ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నారు లండన్‌లోని ఓ కాలనీవాసులు.
గార్డెన్ ఫిట్నెస్...
లాక్డౌన్ కారణంగా జిమ్‌లకు వెళ్లడమే కాదు, కాస్త దూరం నడవడమూ కుదరట్లేలేదు. ఏదో రోజులో ఓ సారి ఇంటి సరుకులు తెచ్చకునేందుకు వీలున్నా.. ఇంటికి ఒక్కరే వెళ్లాలి. ఇలా రోజంతా ఇంట్లోనే ఉండడం వల్ల శరీరం, మనసు డీలా పడిపోతున్నట్లు గ్రహించింది వ్యాయామ గురువు హన్నా వెర్డీయర్. ఇరుగుపొరుగువారికి ఫోన్‌చేసి వారికి వ్యాయామ తరగతులు నిర్వహిస్తానని తెలిపింది.
కొద్దిరోజులుగా ఇంట్లోనే మగ్గుతున్న కాలనీవాసులకు వెర్డీయర్ మాటలు ఊరటనిచ్చాయి. కానీ, లాక్డౌన్ వేళ వ్యాయామ తరగతులకు అనుమతి ఎలా ఇస్తారని అనుకున్నారు. అందుకూ ఓ ఉపాయం ఆలోచించింది వెర్డీయర్. సామాజిక దూరం పాటించేలా, ఎవరి ఇంటి ముందువారే నిలబడి 'గార్డెన్ ఫిట్నెస్' పేరిట ఎక్సర్సైజ్ చేయాలని సూచించింది.