ఏడేళ్ల తన కుమారుడు చేసిన పనికి లక్షల విలువైన కారును అమ్మి బిల్లు కట్టాడో తండ్రి. ఇదంతా.. అతడి చేతికి గంట సేపు ఫోన్ ఇచ్చి వెళ్లడం వల్లే. ఆ కొద్ది సమయంలో.. రూ. లక్షా 30 వేలు మాయం చేశాడు. యూకేలోని నార్త్ వేల్స్లో జరిగిందీ ఘటన.
అసలేమైందంటే... గేమ్స్ ఆడుకుంటానని తండ్రి దగ్గర నుంచి ఫోన్ తీసుకున్న అషాజ్ ముటాసా.. ఆటల మధ్యలో వచ్చే ఎన్నో విలువైన టాప్ అప్స్‌ను కొనుగోలు చేశాడు. వీటి ఒక్కోదాని ఖరీదు 2.7 - 138 డాలర్ల మధ్య ఉంది. అలా మొత్తం 1800 డాలర్లు(రూ. 1.3 లక్షలు) ఖర్చు చేశాడు. ఇదంతా.. తనకు వచ్చిన 29 ఈమెయిల్ రశీదులు చూసి తెలుసుకున్నాడు 41 ఏళ్ల మహ్మద్. లక్షల బిల్లు చూసి షాకయ్యాడు. మొదట అదంతా ఏదో స్కామ్ అనుకున్నా.. ఆ తర్వాతే నిజం తెలుసుకున్నాడు.
''తొలుత.. నన్నెవరో స్కామ్ చేస్తున్నారనుకున్నా. పిల్లలపై ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు.''
- మహ్మద్, బాలుడి తండ్రి
డాక్టర్‌గా పనిచేసే మహ్మద్.. ఇలా జరుగుతుందని ఊహించలేదని అంటున్నాడు. ఒకే నంబర్‌పై అన్ని ఇన్-గేమ్ పర్చేజ్లు రావడమేంటని యాపిల్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అయితే.. 287 డాలర్లు రీఫండ్ మాత్రం చేసింది. మిగతా బిల్లు కట్టేందుకు మాత్రం టొయోటా కారును విక్రయించక తప్పలేదు.
పిల్లలు గేమ్స్ ఆడే ముందు.. తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలని యాపిల్ అతడికి సూచించడం గమనార్హం.