కరోనా వైరస్ మహమ్మారి ధాటికి బ్రిటన్ వణికిపోతుంది. ప్రస్తుతం అక్కడ వైరస్ తీవ్రత గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టినప్పటికీ రానున్న రోజుల్లో మరింత ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో(వచ్చే జనవరి-ఫిబ్రవరి) వైరస్ రెండో దఫా(సెకండ్ వేవ్) విజృంభిస్తే మాత్రం దాదాపు మరో లక్షా 20వేల మంది మృత్యువాతపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు బ్రిటన్ సంసిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.
బ్రిటన్‌లో కొవిడ్ మహమ్మారి విజృంభణతో 2లక్షల 90వేల మంది వైరస్ బారినపడగా 45వేల మంది మృత్యువాతపడ్డారు. ఫ్లూ, ఇతర సీజనల్ వ్యాధులతో ఇప్పటికే జాతీయ ఆరోగ్య సేవలపై ఒత్తిడి పెరిగింది. రానున్న రోజుల్లో కరోనా మహమ్మారి తిరిగి విజృంభిస్తే మాత్రం కేసుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన సీనియర్ వైద్యులు, శాస్త్రవేత్తలు నివేదించారు.
బ్రిటన్‌లో శీతాకాలంలో కరోనా తీవ్రత ఎలా ఉండనుందనే అంశంపై ప్రభుత్వం 37మంది నిపుణలతో కూడిన ప్రత్యేక బృందం నివేదిక రూపొందించింది. తాజాగా ఈ బృందం ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించింది. అయితే, శీతాకాలం నాటికి కచ్చితంగా ఎంత ప్రభావం చూపెడుతుందనే అంచనా వేయలేమని స్పష్టం చేసిన ఈ నిపుణుల బృందం, రెండో దఫా వైరస్ విజృంభణతో భారీ మరణాలు సంభవించే అవకాశం ఉందని నివేదికలో స్పష్టం చేసింది. అయితే ముందస్తు సంసిద్ధతతో మాత్రం దీని తీవ్రతను తగ్గించవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు ఉన్నందున ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
- భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, ఇంటి వాతావరణం వెచ్చగా ఉంచుకోవడం వంటి అంశాలతోపాటు ప్రజల్లో వైరస్‌వ్యాప్తిపై భారీ స్థాయిలో అవగాహన కల్పించడం
- ఆరోగ్య సదుపాయాలను మరింత మెరుగుపరుచుకోవడం
- పీపీఈ కిట్లను అందుబాటులో ఉంచడం
- కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని భారీగా పెంచడం ద్వారా సంసిద్ధంగా ఉండాలని నిపుణుల బృందం వెల్లడించింది
ఇదీ చూడండి:బలూచిస్థాన్‌కు స్వతంత్రం సాధ్యమా? ఎప్పటికి?