UK EU sanctions on Russia:ఉక్రెయిన్లో దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాపై బ్రిటన్ మరిన్ని ఆంక్షలు విధించింది. రష్యా నౌకలు బ్రిటిష్ పోర్టులలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. రష్యన్ల యాజమాన్యంలోని నౌకలతో పాటు ఆ దేశానికి చెందిన వ్యక్తులు నిర్వహించే నౌకలపైనా ఈ నిషేధం వర్తిస్తుంది. ఈ ఆంక్షలను ఎదురించి యూకే పోర్టుల్లోకి ప్రవేశించిన నౌకలను నిర్బంధించే అధికారాన్నీ తమ యంత్రాంగానికి కట్టబెట్టింది.
UK sanctions on Belarus
అదేసమయంలో.. రష్యాకు సహకరిస్తున్న బెలారస్పైనా ఆంక్షల కత్తి ఝులిపించింది. తొలిసారి ఆ దేశంపై ఆంక్షలు విధించింది. బెలారస్ రక్షణ శాఖకు చెందిన నలుగురు సీనియర్ అధికారులు, రెండు సైనిక సంస్థలను ఆంక్షల పరిధిలోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా వీరంతా యూకేకు ప్రయాణించే అవకాశం ఉండదు. బ్రిటన్లోని ఆస్తులను జప్తు చేసి విక్రయించే అధికారం అక్కడి ప్రభుత్వానికి లభిస్తుంది.
Sanctions against Russia
"పుతిన్, ఆయన సన్నిహితులకు వ్యతిరేకంగా ఆర్థికపరమైన చర్యలు చేపడుతున్నాం. ఉక్రెయిన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించే వరకు మేం విశ్రమించం. లుకషెంకో(బెలారస్ అధ్యక్షుడు) ప్రభుత్వం రష్యా దురాక్రమణకు సహకరిస్తోంది. ఇందుకు ప్రతిగా ఆర్థికపరమైన చర్యలను అనుభవించాల్సి ఉంటుంది. వీటి నుంచి దాక్కోవడం కుదరదు. ఎవరూ తప్పించుకోలేరు."
-లిజ్ ట్రస్, యూకే విదేశాంగ కార్యదర్శి
Belarus army men sanctioned
దురాక్రమణకు సహకరించాలని బెలారస్ సైన్యానికి ఆ దేశ మేజర్ జనరల్ విక్టర్ గులేవిచ్ ఆదేశాలు జారీ చేశారని యూకే విదేశాంగ, కామన్వెల్త్ అభివృద్ధి కార్యాలయం(ఎఫ్సీడీఓ) పేర్కొంది. ఇందుకు ఆయనను బాధ్యులను చేయాలని పేర్కొంది. రష్యా సైన్యంతో కలిసి సంయుక్త విన్యాసాలు నిర్వహించడానికి విక్టర్ గులేవిచ్ అనుమతులు ఇచ్చారని తెలిపింది. ఈ పరిణామాలు ఉక్రెయిన్ను ఆక్రమించుకోవడానికి రష్యాకు ఉపయోగపడ్డాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఆంక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
మరిన్ని ఆర్థిక ఆంక్షలు
మరోవైపు, రష్యా సెంట్రల్ బ్యాంకుతో పాటు ఆ దేశ 'ప్రత్యక్ష పెట్టుబడుల నిధి'పైనా అదనపు ఆంక్షలు విధించింది. ఫలితంగా రష్యా ఆర్థిక వ్యవస్థలో మెజారిటీ భాగం యూకే ఆంక్షల పరిధిలోకి వచ్చాయి. తాజా ఆంక్షల్లో భాగంగా.. రష్యా సెంట్రల్ బ్యాంకు, ఆర్థిక శాఖ, జాతీయ సంపద నిధికి యూకే పౌరులు, సంస్థల నుంచి ఆర్థిక సేవలు అందకుండా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తమ భాగస్వామ్య పక్షాలతో కలిసి సమన్వయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లిజ్ ట్రస్ స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థను పతనమయ్యేలా చేసి.. పుతిన్ ఓటమికి దారి తీస్తాయని చెప్పుకొచ్చారు. రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల నిధి చీఫ్ ఎగ్జిక్యూటివ్ కిరిల్ దిమిత్రీవ్పైనా ఆంక్షలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆస్తులను స్తంభింపజేసి, ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించారు.