బ్రిటన్‌లో బోరిస్ జాన్సన్ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. గురువారం జరిగిన బ్రిటన్ సాధారణ ఎన్నికల్లో అధికార కన్సర్వేటివ్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతోంది. తొలి అధికారిక ఫలితాల్లో కన్సర్వేటివ్స్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు అధికారవర్గాలు ప్రకటించాయి. పశ్చిమ లండన్‌లోని ఉక్స్‌బ్రిడ్జ్ నుంచి పోటీ చేసిన ప్రధాని బోరిస్ జాన్సన్ గతం కన్నా ఎక్కువ మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పటికే కన్జర్వేటివ్ పార్టీ సగానికి పైగా స్థానాలను కైవసం చేసుకుంది.
బ్రెగ్జిట్ ప్రక్రియ సమర్థంగా నిర్వహించేందుకు, దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు బ్రిటన్ ప్రజలు తనకు శక్తిమంతమైన మెజార్టీ కట్టబెట్టారని ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు.
ఐరోపా సమాఖ్య ఇచ్చిన గడువులోపు బ్రిటన్ వైదొలగలేకపోయింది. ఈ నేపథ్యంలో 2020 జనవరి 31 తదుపరి గడువు విధిస్తూ ఐరోపా సమాఖ్య మరో అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో పార్లమెంటులో సంపూర్ణ మెజార్టీ కోరుతూ బోరిస్ జాన్సన్ ఎన్నికలకు వెళ్లారు. ఆయనకే ఈసారి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
అంచనాలు నిజమయ్యాయి!
ఎగ్జిట్ సర్వేల అంచనాలను ప్రతిబింబిస్తూ ఫలితాలు వెలువడుతున్నాయి. బ్రిటన్ పార్లమెంటులో మొత్తం 650 స్థానాలకు గురువారం ఎన్నికలు జరగ్గా 368 సీట్లతో కన్జర్వేటివ్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుందని బీబీసీ, ఐటీవీ, స్కై టీవీలు అంచనా వేశాయి. ప్రతిపక్ష లేబర్ పార్టీ 191 స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపాయి.
మరోవైపు ఫలితాలు పూర్తిగా వెలువడకముందే లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బైన్ తన పదవికి రాజీనామా చేశారు. తమ పార్టీ ఘోర పరాభవానికి నైతిక బాధ్యతగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.