బ్రెగ్జిట్... అంతర్జాతీయంగా చారిత్రక పరిణామం. కొన్నేళ్లుగా బ్రిటన్ రాజకీయం తిరుగుతోంది ఈ అంశం చుట్టూనే. ఎట్టకేలకు బ్రెగ్జిట్ పూర్తయ్యేందుకు రంగం సిద్ధమైంది. జనవరి 31న 28 దేశాల ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ అధికారికంగా వైదొలగనుంది.
అసలు సవాలు అదే...
బ్రెగ్జిట్‌పై చర్చ 2010 నుంచి జరుగుతోంది. 2015 సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయం తర్వాత ముందడుగు పడింది. ఈయూలో బ్రిటన్‌లో ఉండాలో లేదో తేల్చేందుకు 2016 జూన్ 23న రెఫరెండం నిర్వహించింది అప్పటి డేవిడ్ కామెరూన్ ప్రభుత్వం. 51.9% ఓటర్లు బ్రెగ్జిట్‌కే జైకొట్టారు. తీర్పు వచ్చింది కానీ... అమలు చేయడానికి చాలా కాలం పట్టింది. మధ్యలో ప్రధాని మార్పు వంటి ఎన్నో నాటకీయ పరిణామాలు. ఎట్టకేలకు ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు రంగం సిద్ధమైంది. అయినా... కథ ఇక్కడితో అయిపోలేదు.
ఈయూ నుంచి విడిపోయాక... కూటమి దేశాలు సహా ఇతర దేశాలన్నింటితో బ్రిటన్ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు 11 నెలలు(డిసెంబర్ 31వరకు) గడువు. వేర్వేరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు, కరోనా వైరస్ వ్యాప్తి వంటి అంతర్జాతీయ పరిణామాల మధ్య ఈ ప్రక్రియ పూర్తి చేయడం బ్రిటన్‌కు అసలు సవాలు. కొన్నేళ్లుగా సంక్షోభాల సవారీ చేస్తున్న దేశాన్ని పూర్తిస్థాయిలో గాడినపెట్టి, ఆర్థిక స్థిరత్వం సాధించడం ప్రధాని బోరిస్ జాన్సన్‌కు అగ్నిపరీక్ష.
ప్రస్తుతం బ్రిటన్ పరిస్థితి ఏంటి?
బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటోంది. జీడీపీ వృద్ధి రేటు క్షీణించడం, పెట్టుబడులు తగ్గడం ఆందోళనకర విషయమైతే... నిరుద్యోగం రేటు రికార్డు స్థాయి కనిష్ఠానికి దిగిరావడం సానుకూలాంశం. 2016 బ్రెగ్జిట్ రెఫరెండం తర్వాత భారీగా పతనమైన పౌండ్ విలువ ఇటీవల గణనీయంగా పుంజుకోవడం మరో విశేషం. మౌలిక వసతుల కల్పనకు భారీ స్థాయిలో ఖర్చు పెడతామన్న ప్రకటన కార్యరూపం దాల్చితే ఆర్థిక రథం మరింత వేగంగా ముందుకు సాగే అవకాశముంది. 2016 ఆగస్టు తర్వాత తొలిసారిగా ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లు తగ్గించడం ఈ వృద్ధికి మరింత ఊతమివ్వనుంది.