బ్రిటన్లో లాక్డౌన్ నిబంధనలను సవరించారు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్. జూన్ వరకు లాక్డౌన్ పొడిగించిన ఆయన కొత్తగా 'కొవిడ్- 19 అప్రమత్తత విధానాన్ని' ప్రవేశపెట్టారు. భౌతిక దూరం నిబంధనలు కొనసాగినంత కాలం ప్రజలు ఎక్కువ సమయం బయట తిరిగేలా షరతులతో కూడిన ప్రణాళికను ఆవిష్కరించారు.
కరోనా వ్యాప్తి రేటును గుర్తించేందుకు శాస్త్రీయ సమాచారం ఆధారంగా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని జాన్సన్ తెలిపారు. జాతినుద్దేశించి ప్రసంగించిన బోరిస్.. 'స్టే అలర్ట్' నినాదంతో ఐదు అంచెల అప్రమత్తత వ్యవస్థ విధివిధానాలను ప్రకటించారు.
"ప్రభుత్వం విధించిన ఆంక్షలతో చాలా వరకు పురోగతి సాధించినా పూర్తి స్థాయిలో మనం గెలవలేదు. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ను ఎత్తివేయటం సరైన పని కాదు. అందువల్ల మార్గదర్శకాలను సవరించేందుకు వివిధ దశల్లో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే బ్రిటన్కు పూర్వ వైభవం వస్తుంది. ఆరోగ్యం మన సొంతం అవుతుంది."
- బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని
ఐదు దశలు ఇలా..
జాన్సన్ చెప్పినదాని ప్రకారం దేశంలో వ్యాధి వ్యాప్తి తీవ్రంగా ఉంటే ఐదో దశ అని.. వైరస్ నుంచి బ్రిటన్కు విముక్తి లభిస్తే ఒకటో దశగా వ్యవహరిస్తారు. మిగిలిన 3 దశలు అవరోహణ క్రమంగా ఉంటాయని స్పష్టం చేశారు. దేశంలో వైరస్ వ్యాప్తిని అనుసరించి ఈ దశలను నిర్ధరిస్తారు. దాని ప్రకారం భౌతిక దూరం నిబంధనల్లో మార్పులు ఉంటాయని బోరిస్ స్పష్టం చేశారు.