కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌తో పాటు ఔషధంపై ప్రపంచవ్యాప్తంగాముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా 'డెక్సమెథసోన్' అనే జనరిక్ ఔషధం కరోనా రోగుల్లో మరణాల తీవ్రతను తగ్గిస్తున్నట్లు ప్రాథమిక ప్రయోగాల్లో నిరూపితమైందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ మధ్యే ప్రకటించారు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కూడా దీన్ని ధ్రువీకరించి.. కరోనా ఔషధ పురోగతిలో ఇది గొప్ప విషయమంటూ బ్రిటన్ శాస్త్రవేత్తలను ప్రశంసించింది.
మొదటి ఔషధం
'ఆక్సిజన్, వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగుల మరణాల సంఖ్యను తగ్గించడంలో ఉపయోగపడుతున్న మొదటి ఔషధం ఇదే,' అని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ప్రకటించారు. అనేక మంది ప్రజలను కాపాడగలిగే ఈ ఔషధం ప్రయోగాల్లో.. పురోగతి సాధించేందుకు కృషిచేసిన బ్రిటన్ ప్రభుత్వం, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌ను అభినందిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. వీరితోపాటు ఈ పురోగతికి దోహదపడిన ఆసుపత్రులు, రోగులను కూడా అభినందిస్తున్నామని తెలిపారు.