జనవరి 31న ఐరోపా సమాఖ్యతో (ఈయూ) విడిపోయింది బ్రిటన్. ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన ప్రకారం మరో 11 నెలల కాలంలో ఈయూతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంది. అయితే కీలక అంశాలపై ఏకాభిప్రాయానికి రావాల్సిన సందర్భంలో ఎలాంటి ఒప్పందాలు లేకుండానే ఇరు ప్రాంతాలు విడిపోయే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సోమవారం నాటి ప్రసంగం దీనికి బలం చేకూర్చేలా ఉంది.
ఐరోపా సమాఖ్యను వీడిన మూడు రోజుల అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు బ్రిటన్ ప్రధాని బోరిస్. ఈయూతో వాణిజ్య ఒప్పందాన్ని చేయాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు. స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలకు సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ రాయబారులు, వాణిజ్యవేత్తలు లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారు.
"ఈయూతో ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. సరిహద్దుల వెంట సాధికారిక నియంత్రణను పునరుద్ధరిద్దాం."
-బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని
అయితే బోరిస్ వ్యాఖ్యలపై అదే స్థాయిలో స్పందించారు ఈయూ వాణిజ్య చర్చల ప్రతినిధి మైఖేల్ బార్నియర్. ఐరోపా సమాఖ్యలోని మిగిలిన 27 దేశాలు బ్రిటన్‌తో ఎలాంటి వాణిజ్య ఒప్పందాన్ని చేసేందుకు అంగీకరించబోవన్నారు. అత్యంత ఖరీదైన స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం చేసేకంటే.. 11 నెలల కాలం ముగిశాక ఎలాంటి ఒప్పందం లేకుండా ఉండటమే మేలన్నారు.
"మేం స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. కానీ అమాయకంగా వ్యవహరించబోం. 45 కోట్ల ఐరోపా వినియోగదారులు, పన్ను రహిత కోటాలు లేని స్థితి ఊరికే రావు."