కొత్త రకం కరోనా వైరస్ కేసులు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో బ్రిటన్ మరోమారు లాక్‌డౌన్ విధిస్తుందన్న వార్తలు వెలువడుతున్నాయి. కరోనా బారినపడి ఆస్పత్రులలో చేరుతున్న వారి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ ఉండటంతో అక్కడి వైద్యారోగ్య, అంబులెన్స్ సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. దేశంలో పూర్తి మూసివేత చర్యలు చేపడితే తప్ప.. ఇక్కడ సంభవించనున్న లక్షలాది కొవిడ్ మరణాలకు అడ్డుకట్ట వేయలేమని నిపుణులు స్పష్టం చేశారు. వైద్యారోగ్య సిబ్బంది కూడా నాలుగో దఫా లాక్‌డౌన్‌ను అమలులోకి తేవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితిని గురించి బ్రిటన్ ప్రభుత్వం అత్యవసర సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోంది.
ఈ నెల 28న ఒక్కరోజే బ్రిటన్ ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య 20,426గా నమోదైంది. ఈ సంఖ్య కొవిడ్ తొలిదశలో నమోదైన అత్యధిక సంఖ్యను దాటేసిందని గణాంకాలు తెలుపుతున్నాయి. రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరగనుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నానాటికీ పెరుగుతున్న కరోనా కేసులతో ఈ దేశంలో వైద్య, అంబులెన్స్ సేవలు కుదేలవుతున్నాయి.
యూకేలో మంగళవారం నమోదైన 53,135 కరోనా కేసులు కొత్త రికార్డు సృష్టించాయి. ఇక ఇంగ్లండులో గత వారం కొవిడ్ కేసుల సరాసరి లక్ష మందికి 807.6గా వెల్లడైంది. ఇది జాతీయ సరాసరి కంటే రెట్టింపు కావటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇక్కడి ఎస్సెక్స్ వంటి ప్రాంతాల్లో ఐతే అదే కాల వ్యవధిలో లక్ష జనాభాకు ఏకంగా 1300 పైగా కేసులు నమోదయ్యాయి.