చిన్నారి షెండికి ఏమీ అర్థం కావడం లేదు.. అందరూ ఇంట్లోని సామాన్లను సర్దుకుంటున్నారు.. ఇంతలో తలుపులపై గట్టిగా శబ్దం.. త్వరగా రెడీ కావాలంటూ అధికారంతో నిండిన గొంతు హెచ్చరిక.. వెంటనే షెండి తల్లిదండ్రులు తమ వస్తువులను తీసుకొని కుమార్తెతో పాటు బయటకొచ్చేశారు. అది ఐరోపాలోని ఒక చిన్న పట్టణం.. నగరంలో ఉన్న 1200 మంది యూదు జాతీయులను బయలుదేరమని జర్మన్ నాజీలు ఆదేశించారు. అయితే తాము వెళ్లబోయేది మృత్యుకేంద్రానికి అని వారికి తెలియదు.. తమ దేశాన్ని ఆక్రమించిన నాజీలు తమను దూరంగా ఉండే కర్మాగారాల్లో పనిచేసేందుకు తీసుకువెళుతున్నారని వారు భావించారు. వెంటనేవారిని ఒక గూడ్సురైలులో పోలండ్‌లోని ఆష్‌విజ్‌కు తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే వేలాదిమంది యూదులున్నారు.
ఆష్‌విజ్ లక్షలాది హత్యలకు వేదిక..
1939లో పోలండ్‌ను నాజీ సేనలు స్వాధీనం చేసుకున్నాయి. ఐరోపాలోని యూదులతో పాటు నాజీ వ్యతిరేకమైన ఇతర జాతీయులను నిర్మూలించాలన్న హిట్లర్ యోచన కార్యరూపం దాల్చింది. పోలండ్‌లోని ఆష్‌విజ్‌లో ఒక కర్మాగారం లాంటి బందీఖానాను నిర్మించారు. యూరప్‌లోని పలు దేశాలను ఆక్రమించిన నాజీలు అక్కడ ఉన్న యూదులను కుటుంబాలతో సహా ఇక్కడకు పంపించేవారు. అక్కడ వారిని గ్యాస్ ఛాంబర్లకు పంపించి సామూహికంగా హత్య చేసేవారు.
బలహీనంగా కనిపిస్తే చాలు..
అప్పటికే గూడ్సురైలు ప్రయాణంలో నీరసపడిన యూదులకు ఇక్కడకు చేరుకోగానే వైద్య పరీక్షలు నిర్వహించేవారు. బలహీనంగా ఉన్న వారిని గ్యాస్ ఛాంబర్లకు పంపించేవారు. వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఎలాంటి అంటురోగాలు రాకుండా పరీక్షలకని నమ్మించేవారు. ఒక వేళ దీన్ని ఎవరైనా పసిగట్టి పారిపోవాలని యత్నిస్తే జాగిలాలు వెంటపడేవి. వారిని సైనికులు కాల్చిచంపేవారు.