ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ది చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత 85-90 శాతం సమర్థత కనబరిచినట్లు ఇంగ్లాండ్ ప్రజా ఆరోగ్య విభాగం (పీహెచ్ఈ)ప్రకటించింది. యూకేలో వ్యాక్సిన్ తీసుకున్న వారిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు పేర్కొంది.
ఈ మేరకు కరోనా టీకా సమర్థతపై తాజాగా వారం నివేదకను విడుదల చేసింది. 2021, మే 9 వరకు 60 ఏళ్లుపైబడిన వారిలో 13,000 మరణాలు, 39,100 మంది ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని తగ్గించినట్లు అంచనా వేసింది. పీహెచ్ఈ డేటాపై కీలక వ్యాఖ్యలు చేశారు యూకే ఆరోగ్య, సామాజిక భద్రత మంత్రి మాట్ హాన్కాక్.
"కొత్త గణాంకాల ప్రకారం వ్యాక్సిన్ ప్రజల ప్రాణాలను రక్షిస్తుందని తేలింది. కొవిడ్-19తో ఆసుపత్రుల్లో గడిపే సమయాన్నీ తగ్గిస్తోంది. 13వేల మరణాలు, 39,100ల మంది ఆసుపత్రుల్లో చేరటాన్ని నిరోధించింది. టీకా ప్రభావం ఎంత మేర ఉందో ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. వైరస్ కొత్త వేరియంట్ల ముప్పుతో టీకా తీసుకోవటం కన్నా గొప్పది ఇంకోటి లేదు."