లండన్ స్కాట్లాండ్ యార్డ్ పరిధిలోని ప్రఖ్యాత లండన్ బ్రిడ్జిపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, కొందరు గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇదీ జరిగింది..
లండన్లో ఉగ్రదాడికి తెగించాడు ఓ ముష్కరుడు. నకిలీ బాంబును ఒంటికి చుట్టుకుని చేతిలో కత్తిపట్టుకొని లండన్ బ్రిడ్జిపై ఉన్న వ్యక్తులపై ఇష్టారీతిన దాడికి పాల్పడ్డాడు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రిడ్జిపై ఉన్న ప్రజలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడుతుండగా కొంతమంది అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో దుండగుడు ఇద్దరు వ్యక్తులపై కత్తితో పొడిచాడు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని కాల్చి చంపారు.
ఎన్నికల ప్రచారం మధ్యలో..
ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్.. ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే ఆపేశారు. డౌనింగ్ స్ట్రీట్కు వచ్చిన ఆయన ఉగ్రవాద ఘటనపై అధికారులతో చర్చించారు. ఉగ్రదాడిని ఖండించారు. సకాలంలో స్పందించిన పోలీసులను అభినందించారు. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. మరణించిన వారిపై ప్రగాఢ సానుభూతి తెలిపారు.