అట్లాంటిక్ హరికేన్ (తుపాన్లు) మినహా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉష్ణమండల తుపాన్లు కొద్ది దశాబ్దాలుగా భూమివైపు వేగంగా దూసుకొస్తున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. ఈ తుపాన్లు 1983 నుంచి దశాబ్దానికి 18 మైళ్లు (30 కిలోమీటర్లు)మేర పశ్చిమం వైపు కదులుతూ ప్రమాదకరంగా మారుతున్నాయని తెలిపింది.
లండన్‌లోని ఇంపీరియల్ కళాశాల తుపాన్ల పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. సైన్స్ జర్నల్‌లో గురువారం ఈ అధ్యయనం ప్రచురితమైంది.
దీని ప్రకారం.. 1980 నుంచి ప్రతి దశాబ్దంలో అదనంగా రెండు తుపాన్లు 124 మైళ్లు (200 కిలోమీటర్ల) మేర భూమిపైకి వస్తున్నాయి. ఇది ఎందుకు జరుగుతుందో పరిశోధకులు తెలుసుకోలేకపోతున్నారు. కానీ, ఈ తుపాన్ల కారణంగా ప్రమాద స్థాయి పెరుగుతోందని చెబుతున్నారు.
గత అధ్యయనాల్లో తీవ్రమైన తుపానులు బలపడుతున్నాయని, తీరం తాకిన క్రమంలో పెను ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. కానీ, కొత్త అధ్యయనం ప్రకారం.. తుపాన్లు భూమికి దగ్గరగా వస్తున్నాయని, అయినప్పటికీ.. తీరం తాకినప్పుడు వాటి తీవ్రతలో పెరుగుదల కనిపించలేదని పరిశోధకులు చెబుతున్నారు.
" ఇది ల్యాండ్ ఫాల్ మాత్రమే కాదు. తుపాను తీరం తాకేందుకు అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు.. కొన్ని సంవత్సరాల క్రింత శాండీ, డోరియన్ తుపాన్లు కలిగించినటువంటి నష్టాన్ని కూడా కలిగిస్తుంది. తుపాను తీరం తాకే ముందు ట్రాక్‌ను పరిశీలిస్తే.. అమెరికా తీరం వెంబడి ఆ తుపానులు చాలా కాలం పాటు ప్రభావం చూపాయి. తీవ్ర నష్టాన్ని కలిగించాయి. మేం తీరప్రాంత కార్యకలాపాలను పరిశీలించేందుకు అది ఒక కారణం. మరోవైపు.. ఆశ్చర్యకరంగా అట్లాంటిక్ తుపానుల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. పశ్చిమం వైపు కదలికలో పెద్దగా మార్పు లేదు. అయితే.. అట్లాంటిక్ తుపానుల జోన్ భూమికి దగ్గరగా ఉండటమే కారణం కావొచ్చు. "
- షుయ్ వాంగ్, లండన్ ఇంపీరియల్ కళాశాల శాస్త్రవేత్త
ఉష్ణమండల తుపాను బేసిన్ పశ్చిమ పసిఫిక్‌లో ఉంది. ఇక్కడ ఎక్కువ ల్యాండ్ఫాల్స్ ఏర్పడతాయి. పశ్చిమం వైపు కదలికలు ప్రపంచ సగటు కంటే రెండు రెట్లు ఎక్కువ. ఇంత వేగంగా ఈ తుపాన్ల కదలికలు ఎందుకు ఉన్నాయనే విషయంపై వాంగ్, అతని సహచరులు పరిశోధనలు చేస్తున్నారు. తుపాన్లు సాధారణంగా గాలులతో తూర్పు నుంచి పశ్చిమం వైపు కదలుతాయి. అందుకే పశ్చిమం వైపునకు తుపాన్లు వేగంగా కదిలేందుకు కారణం కావొచ్చని వాంగ్ అభిప్రాయపడ్డారు. వాతావరణంలో మార్పులు కూడా తుపానులను పశ్చిమం వైపునకు నెట్టివేస్తాయని, కానీ, ఇప్పటికీ వీటి కదలికలపై ప్రశ్నలు మిగిలే ఉన్నాయన్నారు. మానవుల వల్ల ఏర్పడే వాతావరణ మార్పులతోనూ వీటికి సంబంధం ఉందని, కానీ పరిశోధకులు ఇంకా నిరూపించలేకపోతున్నారని చెప్పుకొచ్చారు వాంగ్.
ఇదీ చూడండి:ప్రకృతితోనా మానవాళి వికృత క్రీడ?