Tonga Volcanic Eruption: ఇటీవల దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 'హుంగా టోంగా హుంగా హా అపై' అగ్నిపర్వతం బద్ధలైంది. దీని ధాటికి సమీపంలోని టోంగా అనే ద్వీప దేశం అతలాకుతలమైంది. అక్కడ సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో విధ్వంసం స్థాయి ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు. ఇదిలా ఉండగా, ఈ అగ్నిపర్వత విస్ఫోటం.. జపాన్‌లోని హిరోషిమాపై పడిన అణుబాంబు కంటే వందల రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేసినట్లు నాసా శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. అగ్నిపర్వతం పేలిన సమయంలో విడుదలైన శక్తి.. 5- 30 మెగాటన్నుల టీఎన్‌టీ మధ్యలో ఉంటుందని భావిస్తున్నట్లు నాసా శాస్త్రవేత్త జిమ్ గార్విన్ ఒక ప్రకటనలో తెలిపారు. 1945లో హిరోషిమాపై వేసిన అణుబాంబు పేలుడు శక్తి (దాదాపు 15 కిలో టన్నుల టీఎన్టీ)కంటే ఇది వందల రెట్లు ఎక్కువని చెప్పారు.
Hunga Tonga Tsunami: అగ్నిపర్వతం బద్ధలైనప్పుడు వాతావరణంలో 40 కిలోమీటర్ల మేర బూడిద, పొగ వ్యాపించినట్లు నాసా ఎర్త్ అబ్జర్వేటరీ తెలిపింది. ఈ పేలుడు తీవ్రతకు టోంగా ద్వీపంలోని 65 కిలోమీటర్ల మేర ప్రాంతం తుడిచిపెట్టుకుపోయినట్లు చెప్పింది. 'ఈ ఘటన.. టోంగాను విషపూరిత బూడిదతో కప్పేసింది. నీటి వనరులను కలుషితం చేసింది. పంటలు నాశనమయ్యాయి. రెండు గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి' అని వెల్లడించింది. స్థానికులు ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి కోలుకుంటున్నట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. హానికర బూడిద కారణంగా.. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రక్షణ దళాలు.. టోంగాకు అత్యవసర సహాయ సామగ్రిని చేరవేయడంలో నిమగ్నమయ్యాయి.