కరోనాను ఎదుర్కొనేందుకు మనలో ఉన్న ఆయుధం రోగనిరోధక శక్తి.. మరి ఆ ఆయుధాన్ని మరింత పదునుగా ఎలా మలచాలంటే.....
మధుమేహాన్ని నియంత్రించాలి
మనుషులకు వచ్చే చాలా ఆరోగ్య సమస్యలకు శరీరంలో చక్కెర స్థాయిలే మూలం. అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య లెక్కల ప్రకారం భారత్‌లో 7.7 కోట్ల మంది పెద్దలు మధుమేహంతో బాధపడుతున్నారు. తాజాగా కరోనా వైరస్ కారణంగా మరణించిన ప్రతి నలుగురిలో ఒకరికి మధుమేహం సమస్య ఉన్నట్లు గుర్తించారు. చక్కెర వ్యాధి బాధితుల్లో కరోనా వైరస్ ముప్పు రెండింతలు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని కూడా అది అచేతనంగా మార్చేస్తుందని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన వైద్యనిపుణులు వెల్లడించారు. టైప్2 మధుమేహం బారిన పడినట్లు కూడా తెలియని వారు బ్రిటన్‌లోనే దాదాపు 10 లక్షల మంది ఉంటారని అంచనా. ముఖ్యంగా గొంతు ఎండిపోవడం, రాత్రివేళల్లో ఎక్కువసార్లు మూత్రానికి పోవాల్సి రావడం వంటి లక్షణాలు వీరిలో కనిపిస్తాయి. అందుకే 40 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ రక్తంలో చక్కెర శాతాన్ని పరీక్షించుకోవాలి. బరువు తగ్గించుకోవడం, ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించడం వంటివి చేస్తే దీనిని తేలికగా అదుపు చేయొచ్చు.
హృదయం పదిలం
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఏటా 1.7 కోట్ల మంది హృద్రోగాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. గుండెజబ్బులు దరిచేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల కరోనా ముప్పును గణనీయంగా తగ్గించొచ్చని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ కౌశిక్‌రాయ్ తెలిపారు. చాలా మంది హృద్రోగులు రక్తపోటును అదుపులో ఉంచుకొనేందుకు ఏసీఈ ఇన్‌హ్యాబిటర్లను వినియోగించాల్సి ఉంది. కరోనావైరస్ ఏసీఈ2కు సోకుతుండటంతో ముప్పు పెరిగిపోతుందని ఆందోళన చెందారు. కానీ, చాలా పరిశోధనల్లో దీనిని బలపరిచే ఆధారాలు లభించలేదు. హృద్రోగులు ఏసీఈ ఇన్‌హ్యాబిటర్లను నిర్భయంగా వాడుకోవచ్చని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణురాలు డాక్టర్ లౌరా కొర్ చెప్పారు. ప్రతి ఇంట్లో రక్తపోటును తనిఖీ చేసుకొనే పరికరం ఉంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యానికి 'పొగ' పెట్టొద్దు
తొలుత పారిస్‌లోని ఒక ఆసుపత్రిలో చేసిన చిన్నస్థాయి పరిశోధనలో పొగతాగే వారికి కరోనాసోకే ముప్పు తక్కువగా ఉంటుందని తేలింది. దీంతో నికోటిన్ ప్యాచ్‌లు వాడి దీనికి చికిత్స చేయొచ్చని భావించారు. కానీ, గత వారం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం 11,590 మంది కొవిడ్ రోగులపై పరీక్షలు నిర్వహించింది. పొగతాగే అలవాటు ఉన్న వారిలో కొవిడ్ మృతుల సంఖ్య.. పొగతాగని వారి కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ధూమపానం వల్ల ఊపిరితిత్తులు, శ్వాసనాళం దెబ్బతిని కొవిడ్ లక్షణాలు తీవ్రస్థాయిలో కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఈ-సిగరెట్లు కూడా భారీ ముప్పును తీసుకొస్తున్నట్లు గుర్తించారు. గతంలో సాధారణ సిగరెట్లు తాగినవారు.. ఈ-సిగరెట్లు ఉపయోగించడం మొదలుపెట్టారు. వారు కూడా మృతుల్లో ఎక్కువగానే ఉన్నారు. వీలైనంత వరకు వైద్యుల సాయంతో ధూమపానం అలవాటును మానేయడం మంచిది.
వ్యాయామం తప్పనిసరి
వ్యాయామాలు నేరుగా కొవిడ్‌పై పనిచేస్తాయని ఇప్పటి వరకు పరిశోధనల్లో వెల్లడి కాలేదు. కానీ, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. వారానికి నాలుగుసార్లు రోజుకు 30 నిమిషాలు చొప్పున నడిచే వారికి వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం గణనీయంగా తగ్గిపోతుంది. వ్యాయామం రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని సరైన స్థాయిలో ఉంచుతుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. ముఖ్యంగా పొట్ట వద్ద కొవ్వును కరిగిస్తుంది. సాధారణంగా హృద్రోగులు వాయ్యామాలు చేస్తూ చికిత్స తీసుకొంటే వారికి రెండోసారి సమస్య తిరగబెట్టే అవకాశాలు మూడొంతులు తగ్గిపోతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం ఉండాలి. 71-90 ఏళ్ల వారు అదనంగా చేసే 30 నిమిషాల వ్యాయామం వారిలో మరణం ముప్పును 17 శాతం తగ్గిస్తుంది. దీనికి బ్రిటన్ యువరాజు ప్రిన్స్‌చార్లెస్ ఒక ఉదాహరణ. ఆయన సాధారణ వ్యాయామాలు చేస్తూ చికిత్స పొందడంతో వారంలోనే కరోనా నుంచి బయటపడ్డారు.