కరోనా కట్టడికి అందుబాటులోకి తీసుకొచ్చిన ఆక్స్‌ఫర్డ్ టీకాపై నిర్వహించిన తాజా అధ్యయనంలో కీలక విషయాలు బయటపడ్డాయి. రెండు డోసుల మధ్య విరామం మూడు నెలల వ్యవధి ఉన్నట్లయితే టీకా మరింత సమర్థంగా పని చేస్తున్నట్లు పరిశోధనలో తేలింది(ప్రస్తుతం ఈ విరామ కాలం ఆరువారాలు మాత్రమే ఉంది). ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఒక్క డోసు మంచి ఫలితాలిస్తుండటం వల్ల రెండో డోసుకు మూడు నెలల విరామం ఇవ్వొచ్చని పరిశోధకులు సూచించారు. ఈ విధంగా ఎక్కువ మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసే అవకాశముంటుందని వారు తెలిపారు.
ఈ మేరకు పరిశోధనలు జరిపిన బ్రిటన్లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం.. మూడోదశ ర్యాండ్మైజ్డ్ కంట్రోల్ ట్రయల్ నుంచి సేకరించిన ఫలితాలను విశ్లేషించగా.. ఈ విషయాలు వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు. దీనికి సంబంధించిన అంశాలను లాన్సెట్ జర్నల్లో ప్రచురించారు. విరామ సమయం పెరగడం వల్ల టీకాల సరఫరా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
"సరిపడినన్ని టీకాలు లేకపోవడం వల్ల పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాం. వ్యాక్సిన్ సమర్థత ఆధారంగా టీకా డోసులకు మధ్య విరామాన్ని పెంచడంపై ప్రభుత్వాలు పునరాలోచించాలి."
- ప్రొఫెసర్ ఆండ్రూ పొలార్డ్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం
రెండు డోసులు ఇవ్వడం కంటే, సమర్థత కలిగిన ఒక్క డోసునే ఎక్కువ మందికి అందించడం ఉపయుక్తంగా ఉంటుందని పొలార్డ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ పరిమిత సరఫరాలో ఉన్న ప్రదేశాల్లో దీనిని పాటించడం మంచిదని సూచించారు.
ఈ పరిశోధనలో భాగంగా వివిధ విరామాల్లో వ్యాక్సిన్లను అందించడం ద్వారా రోగనిరోధకశక్తి పెరగడాన్ని అధ్యయనం చేశారు. ఇందులో యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికాకు చెందిన 17,178 మంది ఆరోగ్య కార్యకర్తలను ఎంచుకున్నట్లు వారు తెలిపారు. ఆరు వారాల్లోపు వ్యాక్సిన్ రెండో డోసును తీసుకున్నవారికంటే 12 వారాల తర్వాత తీసుకున్న వారిలో మెరుగైన ఫలితాలు నమోదైనట్లు వారు వెల్లడించారు. ఒక్కడోసు తీసుకున్న వారిలో 76 శాతం రోగనిరోధకశక్తి పెరిగిందని వెల్లడించారు. ఒక్క డోసు తీసుకున్న తర్వాత కరోనా యాంటీబాడీలు మూడు నెలల పాటు శరీరంలో ఉంటున్నాయని తెలిపారు. తక్కువ మోతాదులో ఎక్కువ రక్షణనిచ్చే మార్గాలను అన్వేషిస్తున్నామని పరిశోధనలో సభ్యురాలైన మెరైన్ వౌసే తెలిపారు.
ఇదీ చూడండి:సీరం నుంచి 'కొవాక్స్'కు 1.1 బిలియన్ల టీకాలు!