తెలంగాణ

telangana

ETV Bharat / international

AstraZeneca: డోసులు ఆలస్యమైనా సమర్థంగానే? - ఆస్ట్రాజెనికా టీకా రెండో టైమ్​

ఆస్ట్రాజెనెకా టీకాపై తాజాగా జరిగిన అధ్యయనంలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ రెండు, మూడో డోసులను ఆలస్యంగా తీసుకోవడం వల్ల రోగనిరోధకత ప్రతిస్పందనలు బాగానే ఉంటున్నాయని తేలింది. అంతేకాకుండా రెండో డోసు తీసుకున్న 6 నెలల తర్వాత మూడో డోసు తీసుకున్నట్లయితే.. యాంటీబాడీలు మరింత వృద్ధి చెందుతున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ నిపుణుల అధ్యయనంలో వెల్లడైంది.

AstraZeneca
ఆస్ట్రాజెనెకా

By

Published : Jun 29, 2021, 5:36 AM IST

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ రెండు, మూడో డోసులను ఆలస్యంగా తీసుకోవడం వల్ల రోగనిరోధకత ప్రతిస్పందనలు బాగానే ఉంటున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా తొలి డోసు తీసుకున్న 45 వారాల తర్వాత సెకండ్‌ డోసు తీసుకున్నా.. రోగనిరోధకత ప్రతిస్పందనలు తగ్గడం కాకుండా మరింత పెరుగుతున్నట్లు వెల్లడైంది. అంతేకాకుండా రెండో డోసు తీసుకున్న 6 నెలల తర్వాత మూడో డోసు తీసుకున్నట్లయితే.. యాంటీబాడీలు మరింత వృద్ధి చెందుతున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ నిపుణుల అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయన నివేదిక మరికొన్ని రోజుల్లోనే పరిశీలనకు అందుబాటులో ఉంచనున్నారు.

రెండో డోసు తర్వాత 6 నెలలకు..

తొలి డోసు తీసుకున్న 10 నెలల తర్వాత కూడా రెండో డోసు తీసుకున్నా.. రోగనిరోధకత ప్రతిస్పందనలు అద్భుతంగా ఉన్నాయని తాజా అధ్యయనంలో పాల్గొన్న ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకుడు ఆండ్రూ పొలార్డ్‌ పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్‌ సరఫరా లేమితో సతమతమవుతున్న దేశాలకు ఇది ఊరట కలిగించే విషయమన్నారు. ముఖ్యంగా రెండో డోసుపై ఆందోళన చెందుతున్న వారికి తాజా ఫలితాలు ఎంతో మేలు కలిగించేవని పొలార్డ్‌ అభిప్రాయపడ్డారు. ఇక ఆస్ట్రాజెనెకా మూడో డోసు కూడా మెరుగైన ఫలితాలను ఇస్తుందని చెప్పారు. వ్యాక్సినేషన్‌లో దూసుకెళ్తున్న దేశాలకు మూడో డోసు అవసరమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే, కొత్తగా వెలుగు చూస్తున్న వేరియంట్‌లను ఎదుర్కొనేందుకు మూడో డోసు అవసరమా? లేదా అనే విషయంపై ఇంకా స్పష్టతలేదని.. అయినప్పపటికీ ఫలితాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయని అధ్యయనంలో పాల్గొన్న సీనియర్‌ పరిశోధకురాలు థెరిసా లాంబే అభిప్రాయపడ్డారు.

కరోనా వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్‌లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ కొన్ని వ్యాక్సిన్‌ డోసుల మధ్య గడువు వేరువేరుగా ఉండడంతో వాటిపై అంతర్జాతీయంగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా డోసుల మధ్య వ్యవధిని పలు దేశాలు వేర్వేరుగా నిర్ణయిస్తుండడంతో వాటిపై కాస్త అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా డోసుల మధ్య వ్యవధిపై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనాలు చేస్తోంది. మరోవైపు ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా టీకాను దాదాపు 160 దేశాల్లో వినియోగిస్తున్నారు. భారత్‌లోనూ కొవిషీల్డ్‌ పేరుతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారీతోపాటు కేంద్ర ప్రభుత్వానికి ఈ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తోంది.

ఇదీ చూడండి:యూకే విమానాల రాకపై ఆ దేశం నిషేధం

ABOUT THE AUTHOR

...view details