విదేశాల్లో విహారం... విలాసవంతమైన హోటళ్లలో విడిది... ఆ మధుర స్మృతులతో ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు... కాస్త సంపన్న కుటుంబాల్లో ప్రతి వేసవి ఇలానే ఉంటుంది. ఈసారి మాత్రం కథ మారింది. కరోనా సంక్షోభంతో సెలవులన్నీ ఇంట్లోనే గడిచిపోయాయి.
కరోనా ఇలా ఎంతో మంది ఫారిన్ ట్రిప్ కలలను మాత్రమే తారుమారు చేయలేదు. పర్యటకంపైనే ప్రధానంగా ఆధారపడే ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థల్నీ దెబ్బకొట్టింది. అందుకే అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికిప్పుడు పూర్వవైభవం రాకపోయినా... కనీసం ఉనికి కాపాడుకోవడం ఎలాగా అని తీవ్ర మేధోమథనం చేస్తున్నాయి.
పర్యటక రంగాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు ఇప్పటికే కొన్ని దేశాలు వినూత్న ప్రణాళికలు సిద్ధం చేశాయి. వాటిలో కొన్నింటిని ఇప్పటికే అమలు చేయడం ప్రారంభించాయి. వైరస్ భయాలు లేకుండా చేసి, డిస్కౌంట్ ఆఫర్లతో పర్యటకుల్ని ఆకర్షించడమే ఈ ప్రణాళికల్లోని ముఖ్యాంశం.
ఖర్చు మాది... ఫన్ మీది...
విహార యాత్రకు అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని ఆయా దేశాల ప్రభుత్వాలే భరిస్తున్నాయి. ఇందుకోసం 2+1 ఫార్ములాను అమలు చేస్తున్నాయి. హోటళ్లలో 2 రోజుల వసతి కోసం బుక్ చేస్తే, మూడో రోజు ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ప్రస్తుతం నాలుగు దేశాలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి.
1. సైప్రస్
బ్రిటీష్ పర్యటకులను ఆకర్షించే బ్రహ్మాండమైన ద్వీప దేశం సైప్రస్. "మా సన్నీ బీచ్లలో సరదాగా గడుపుతున్నప్పుడు మీరు కొవిడ్-19 బారిన పడితే... మీ విహార యాత్ర ఖర్చు మొత్తం మేమే భరిస్తాం" అని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. అవసరమైతే పర్యటకులను క్వారంటైన్ చేసేందుకు, చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా 100 పడకల ఆస్పత్రితో పాటు అనేక హోటళ్లను సిద్ధం చేసింది.