తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచంలో తొలి టీకా తీసుకున్న వ్యక్తి మృతి!

ప్రపంచంలో తొలి కరోనా టీకా తీసుకున్న బ్రిటన్​కు చెందిన వ్యక్తి ఇతర అనారోగ్య కారణాల వల్ల మృతి చెందినట్లు యూకే వెల్లడించింది. గతేడాది వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ ఆరు నెలలపాటు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది. కొన్నిరోజుల క్రితం టీకాకు సంబంధం లేని ఇతర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.

Vaccine
టీకా

By

Published : May 27, 2021, 10:15 AM IST

ప్రపంచంలో తొలి కరోనా టీకా తీసుకున్న పురుషుడిగా బ్రిటన్‌కు చెందిన ఓ వృద్ధుడు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వ్యక్తి కన్ను మూసినట్లు బ్రిటన్‌ మీడియా వెల్లడించింది. గతేడాది వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ ఆరు నెలలపాటు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది. కొన్నిరోజుల క్రితం టీకాకు సంబంధం లేని ఇతర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. టీకా తీసుకున్న ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తిగా 91ఏళ్ల ఓ వృద్ధురాలు నిలువగా.. తొలి టీకా తీసుకున్న పురుషుడిగా ప్రస్తుతం కన్నుమూసిన విలియం షేక్స్‌పియర్‌(81) నిలిచారు.

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 35లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. ఇలాంటి సమయంలో వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం ప్రపంచ దేశాలకు ఆశాదీపంగా నిలిచింది. ఇందులో భాగంగా బ్రిటన్‌కు చెందిన విలియం షేక్స్‌పియర్‌ అనే 81ఏళ్ల వృద్ధుడికి 2020 డిసెంబర్‌ 8వ తేదీన కొవెన్ట్రీ అండ్‌ వార్‌విక్‌షైర్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌లో తొలి టీకా ఇచ్చారు. అయితే తొలి వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తిగా 91ఏళ్ల వృద్ధురాలు మార్గరెట్‌ కీనన్‌ నిలిచింది. ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను వీరిద్దరికీ అందించారు.

క్షీణించిన ఆరోగ్యం..

అయితే, వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం పూర్తి ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ.. ఇతర అనారోగ్య కారణాలతో ఈమధ్యే ఆస్పత్రిలో చేరినట్లు కొవెన్ట్రీ కౌన్సిలర్‌ జైనే ఇన్నెస్‌ పేర్కొన్నారు. అనంతరం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మే 20వ తేదీన మరణించినట్లు వెల్లడించారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడంలో యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిన ఆయనకు.. మనమూ టీకా తీసుకోవడమే ఆయనకిచ్చే గొప్ప నివాళి అని అభిప్రాయపడ్డారు. ఇక మూడు దశాబ్దాల పాటు అక్కడి లేబర్‌ పార్టీకి సేవలందించిన షేక్స్‌పియర్‌.. వ్యాక్సిన్‌ తీసుకోవడంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని వెస్ట్‌ మిడ్‌లాండ్స్‌ లేబర్‌ పార్టీ అభిప్రాయపడింది.

ఇదిలాఉంటే, కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో పంపిణీ ప్రక్రియ కాస్త మందకొడిగా సాగినప్పటికీ ప్రస్తుతం అన్ని దేశాల్లోనూ ముమ్మరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇప్పటివరకు 176 దేశాల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగా 171 కోట్ల డోసులను పంపిణీ చేశారు. వ్యాక్సిన్‌ పంపిణీలో బ్రిటన్‌, అమెరికా, ఇజ్రాయెల్‌లు ముందువరుసలో ఉన్నాయి. భారత్‌లోనూ ఇప్పటివరకు 20కోట్లకుపైగా డోసులను పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:Covid updates: 2.11 లక్షల కేసులు.. 3,847 మరణాలు

ABOUT THE AUTHOR

...view details