అర్ధరాత్రి సమయం.. వీనుల విందైన సంగీతం.. విద్యుద్దీపాల సోయగం.. అప్పుడే ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. నదిపై ఉండే వంతెన రెండుగా చీలుకుంటూ నెమ్మదిగా తెరుచుకుంది. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ తీర ప్రాంతం ఈ అపురూప ఘట్టానికి వేదికైంది. 'సింగింగ్ బ్రిడ్జెస్' ప్రాజెక్టులో భాగంగా.. ప్యాలెస్ వంతెనను అక్కడి అధికారులు తెరిచారు.
రష్యాలోని ప్రముఖ సంగీతకారులు.. స్వరపరిచిన సంగీతం వినిపిస్తుండగా.. ప్యాలెస్ బ్రిడ్జ్ వంతెన తెరుచుకుంది. ఏటా వేసవి కాలంలో అర్ధరాత్రి పూట ఈ వంతెనలను తెరుస్తూ ఉంటారు. అయితే.. ఈ ప్యాలెస్ వంతెన దానంతట అదే తెరుచుకోదు. అక్కడ హెడ్ ఇంజినీర్‌గా పని చేస్తున్న స్టానిస్లావ్ ఫుస్తాషిన్స్కీ ఇందులో కీలక పాత్ర పోషిస్తారు.
కంట్రోల్ రూంలో ఉంటూ ప్యాలెస్ వంతెన తెరిచే పూర్తి బాధ్యతను నిర్వర్తిస్తారు స్టాన్స్లివ్. అక్కడ ఉండే ఓ మానిటర్లో పరిస్థితిని వీక్షిస్తూ ఆయన వంతెనను తెరుస్తారు.
ఎలా పని చేస్తుందంటే..?
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఉన్న ఇలాంటి తెరుచుకునే వంతెనల పనితీరు.. ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. అంటే.. ట్రోయిటిస్కీ వంతెనను తెరిచేవారు.. ప్యాలెస్ బ్రిడ్జ్‌ను తెరవలేరు. హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా ప్యాలెస్ బ్రిడ్జ్ పని చేస్తుంది. దీని వెనుక ఉండే సాంకేతికత శ్రమను స్టాన్స్లివ్ ఇలా వివరిస్తున్నారు.
"ఈ కంట్రోల్ రూంలో రెండు విభాగాలు ఉంటాయి. అవి రెండు సమానంగా పని చేస్తున్నాయనే విషయాన్ని మనం ఇక్కడ మానిటర్లో చూడవచ్చు. ఈ రెండు నియంత్రణ వ్యవస్థలు.. ఒకదానితో మరొకదానికి సంబంధం లేకుండా పని చేస్తాయి. ఈ రెండు నియంత్రణ వ్యవస్థల్లో ఏదైనా ఒకదాంట్లో సమస్య తలెత్తినా.. మరో దాంతో మనం పని చేసుకోవచ్చు."
-స్టానిస్లావ్ ఫుస్తాషిన్, ప్యాలెస్ వంతెన హెడ్ ఇంజినీర్.