ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారం(nobel peace prize 2021) ఇద్దరిని వరించింది. ప్రజాస్వామ్యానికి మూలమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం చేసిన కృషికి గానూ ప్రముఖ పాత్రికేయులు మరియా రెసా(ఫిలప్పీన్స్), దిమిత్రి మురటోవ్(రష్యా)లకు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది(nobel peace prize). ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం వీరు(Nobel Peace Prize winners) ధైర్యంగా పోరాడుతున్నారని కమిటీ ఈ సందర్భంగా ప్రశంసించింది.
అధికార దుర్వినియోగం, అసత్యాలు, యుద్ధ కాంక్ష నుంచి రక్షించడానికి స్వేచ్ఛా, స్వతంత్ర, వాస్తవ-ఆధారిత జర్నలిజం ఉపయోగపడుతుందని తెలిపింది స్వీడిష్ కమిటీ. భావ ప్రకటనా స్వేచ్ఛ, సమాచార స్వేచ్ఛ.. ప్రజలకు సమాచారం ఇవ్వటానికి ఉపయోగపడుతుందన్న వాదనతో ఏకీభవిస్తున్నట్లు పేర్కొంది. వీరిద్దరూ తమ తమ దేశాల్లో దినపత్రికలను నడుపుతున్నారు. ప్రజాస్వామ్యం, యుద్ధం, సంక్షోభాల నుంచి కాపాడేందుకు.. ఈ హక్కులు చాలా కీలకమని నార్వేజియన్ నోబెల్ కమిటీ తెలిపింది. ప్రాథమిక హక్కులను రక్షించటం, వాటి ప్రాముఖ్యతను చాటేందుకే మరియా రెస్సా, డిమిత్రి మురాటోవ్‌ను ఈ అవార్డ్‌కు ఎంపిక చేసినట్లు పేర్కొంది.
రాప్లర్ పేరుతో..
ఫిలిప్పీన్స్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు మరియా రెస్సా (Nobel Peace Prize winners).. తమ దేశంలో నానాటికీ పెరుగుతున్న అధికార దుర్వినియోగం, హింసను తన కలంతో ప్రపంచానికి తెలియజేశారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోసం 2012లో ఆమె 'రాప్లర్' పేరుతో ఓ డిజిటల్ మీడియా కంపెనీని స్థాపించారు. ఓ జర్నలిస్టుగా, రాప్లర్ సీఈఓగా రెసా.. ఎన్నో సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్రచురించారు. అధికార పరంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటూనే.. భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడుతూ వస్తున్నారు.