కరోనా ఓ వైపు విజృంభిస్తుంటే.. మరోవైపు సరైన వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం ప్రజలను కలవరపెడుతోంది. ఇలాంటి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి స్థానిక ప్రభుత్వం వరకూ చెబుతున్న మాటల్లా.. కనీసం 2 మీటర్ల భౌతిక దూరం పాటించండనే. బయట సంగతి ఎలా ఉన్నా.. వందల మంది కలిసి పనిచేసే ఆఫీసుల్లో దూరం పాటించడం కాస్త కష్టమే. అందుకే కొవిడ్ తెచ్చిన ఈ కష్టాన్ని తీర్చేందుకే బ్రిటన్‌లోని రోబోటిక్స్ సంస్థ థార్సస్... 'బంప్' డివైజ్‌ను తీసుకొచ్చింది.
ఐడీ కార్డులా మెడలో వేసుకొనే ఈ సాధనంతో.. మేలైన పని ప్రదేశంలో అవాంతరాలు లేకుండా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. ఈ బంప్.. ట్రాఫిక్ సిగ్నల్లా పనిచేస్తుందంటున్నారు థార్సస్ సంస్థ సీఈవో బ్రియాన్ పల్మేర్.
"బంప్- ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థల మధ్య ఒక సారూప్యత ఉంది. సురక్షితంగా గమ్యాన్ని చేరేందుకు డ్రైవర్లకు ట్రాఫిక్ లైట్లు సూచనలు ఇస్తుంటాయి. ఇదే తరహాలో బంప్ కూడా పని చేస్తుంది. భౌతిక దూరం పాటించని ప్రదేశాల్లో ఈ పరికరం హెచ్చరిస్తుంటుంది."
- బ్రియాన్ పల్మేర్, థార్సస్ సంస్థ సీఈవో
భౌతిక దూరం 2 మీటర్ల కన్నా తగ్గితే.. బీప్ శబ్దంతో బ్లూ లైట్ హెచ్చరిస్తుంది. అయినా పట్టించుకోకుండా ఒక మీటర్ కంటే దగ్గరగా వస్తే.. రెడ్ లైట్‌తో పాటు దూరాన్ని గుర్తుచేస్తూ వరుస బీప్ శబ్దాలతో హోరెత్తిస్తుంది.
"మొదటి నుంచి అందరూ భౌతిక దూరంపై దృష్టి సారించారు. ఇప్పడు చేతులు, ముఖం ముట్టుకోవద్దంటూ చెప్తున్నారు. బంప్ పరికరం జనాలకు కొత్త అలవాటును నేర్పుతోంది. జాగ్రత్తగా ఉండండి.. రెండడుగులు వెనక్కి జరగండంటూ హెచ్చరిస్తుంది. అదీ ఎదుటివారు నొచ్చుకోకుండానే చెప్తుంది."
- బ్రియాన్ పల్మేర్, థార్సస్ సంస్థ సీఈవో