'స్పుత్నిక్-వీ' పేరుతో కరోనావైరస్ టీకాను అందుబాటులోకి తెచ్చినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన ప్రకటనతో ప్రపంచం దృష్టి ఇప్పుడు ఆ దేశంపై పడింది. అంతేకాదు.. తన రక్తం పంచుకుపుట్టిన కుమార్తె కూడా టీకా తీసుకొందని ప్రకటించడంతో విమర్శించే వారు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొల్పారు పుతిన్. పుతిన్ శైలే అంత.. ఈ మాజీ కేజీబీ గూఢచారి ఎదుటివారిని ఆత్మరక్షణలోకి నెట్టేయడంలో దిట్ట. దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారంపై ఆయన ఉడుంపట్టు కొనసాగుతోంది. రష్యా ఆర్థికంగా బాగా దెబ్బతిన్నా.. ప్రపంచంలో ఆ దేశ పలుకుబడి ఏమాత్రం తగ్గకుండా చేసిన ఘనత పుతిన్‌కే దక్కుతుంది. అమెరికా-రష్యా సంబంధాలను ఈయనే బాగు చేయగలరని జార్జి డబ్ల్యూ బుష్ అన్నారంటే ఎంతగా ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చు. కానీ, అమెరికా డెమొక్రటిక్ పార్టీ నేత హిల్లరీ క్లింటన్ పుతిన్‌ను అస్సలు నమ్మడానికి వీల్లేని వ్యక్తి అని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె ఓటమికి ఓ రకంగా పుతినే కారణమనే ఆరోపణలున్నాయి.
గూఢచర్యంపై ఆసక్తి..
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పుట్టిన పుతిన్ ఒక సింగిల్ బెడ్రూంలో పెరిగాడు. ఆయన తండ్రి రెండో ప్రపంచ యుద్ధంలో సబ్‌మెరైన్‌లో పనిచేసేవారు. తల్లి ఫ్యాక్టరీలో పనిచేసేది. చిన్నప్పుడే ఇద్దరు సోదరులను పుతిన్ కోల్పోయాడు. 16ఏళ్ల వయస్సులో సినిమాలతో ప్రభావితమై గూఢచారిగా మారేందుకు 1968లో నేరుగా సోవియట్ గూఢచర్య సంస్థ కేజీబీ ఆఫీస్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకొన్నారు. అప్పట్లో కుదరకపోవడంతో న్యాయవిద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత కేజీబీలో చేరి నాటి సోవియట్ కనుసన్నల్లోని తూర్పు జర్మనీ కేజీబీ కార్యాలయంలో ట్రాన్స్‌లేటర్‌గా చేరారు. 1989లో జర్మనీ గోడను కూల్చే సమయంలో భారీ సంఖ్యలో ప్రజలు అక్కడి సోవియట్ ఆఫీస్‌ను చుట్టుముట్టారు. వెంటనే కేజీబీ ఆఫీస్‌లో ఫైల్స్‌ను దహనం చేయించాడు. అక్కడికి భారీగా చేరినవారిని చెదరగొట్టేందుకు వ్యూహాత్మంగా కార్యాలయం బయటకు వచ్చి సాయుధులతో కాల్పులు జరిపిస్తానని హెచ్చరించాడు. దీంతో వారు వెనక్కి వెళ్లిపోయారు. ఈ ఘటన పుతిన్‌కు పేరుతెచ్చింది.
రాజకీయ సోపానంలో పైపైకి..
సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయిన సమయంలో మిఖాయిల్ గోర్భచేవ్ నుంచి అధికారం బోరిస్ ఎల్సిన్‌కు వెళ్లింది. ఎల్సిన్‌పై అవినీతి ఆరోపణలు పెరిగిపోవడంతో అధికారం నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అదే సమయంలో పుతిన్ రాజకీయంగా మెల్లిగా ఎదిగారు. 1997లో అధ్యక్షుడి వద్ద డిప్యూటీ చీఫ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ స్టాఫ్ పదవిలో నియమితులయ్యారు. 98లో పదోన్నతి లభించింది. 99లో పుతిన్ ఉప ప్రధానిగా నియమితులయ్యారు. పుతినే తన వారసుడని ఎల్సిన్ బలంగా నమ్మారు. ఆయనపై అవినీతి ఆరోపణలు పెరిగిపోవడతో 1999 డిసెంబర్ 31న రాజీనామా చేసి పగ్గాలను పుతిన్‌కు అప్పజెప్పారు. ఈ క్రమంలో ఎల్సిన్‌తో ఒప్పందం ప్రకారం ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అక్కడి నుంచి రష్యాపై పుతిన్ పట్టు పెరిగిపోయింది. చెచెన్ వేర్పాటువాదులను పుతిన్ అణచివేసిన తీరు ప్రజలను ఆకట్టుకుంది.
1999 సెప్టెంబర్‌లో పలు చోట్ల ప్రభుత్వమే పేలుళ్లు జరిపించి.. వేర్పాటు వాదులపైకి నెట్టి.. క్రూరంగా అణచివేయడం వెనుక పుతిన్ హస్తం ఉందంటారు. చెచెన్యాను రిపబ్లిక్‌గా ప్రకటించారు.. కొన్నాళ్లకే నమ్మకస్తుడు రంజాన్ కడ్యరోవ్ చేతికి పగ్గాలు వచ్చేట్లు చేశారు. ఇక రష్యాలో రెండు సార్లు అధ్యక్షుడిగా.. 1999 నుంచి 2008 వరకు, ప్రధానిగా 2008-2012 వరకు బాధ్యతలు నిర్వహించారు. ఏ నాయకుడూ రెండుసార్లకు మించి అధ్యక్ష పదవిలో కొనసాగరాదన్న రష్యా రాజ్యాంగ నిర్దేశాన్ని అధిగమించడానికి 2008 ఎన్నికల్లో పుతిన్ ప్రధానమంత్రి పదవిని చేపట్టి, దిమిత్రీ మెద్వెదేవ్‌కు దేశాధ్యక్ష పదవి అప్పగించారు. కానీ, పాలనా పగ్గాలన్నీ పుతిన్ చేతిలోనే ఉంటాయన్నది బహిరంగ రహస్యమే. ఈ విధంగా రాజ్యాంగ పరిమితిని అధిగమించిన తరవాత 2012 ఎన్నికల్లో ఆయన మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టి, ప్రధానిగా మెద్వెదేవ్‌ను నియమించారు. 2014లో ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టి, క్రైమియాను జనవాక్య సేకరణ(రెఫరెండం) సాకుతో రష్యాలో కలిపేసుకున్నారు. ఎదురులేని విజేతగా ప్రజల ముందుకెళ్లి 2018 ఎన్నికల్లో మళ్లీ భారీ మెజారిటీతో గెలిచారు. ఈ ఏడాది జూన్ 25-జులై ఒకటి మధ్యకాలంలో జనవాక్య సేకరణ జరిపి, అధ్యక్షుడి పదవీకాలంపై పరిమితులను తొలగించేసుకున్నారు. ఆయన 2036 వరకు తానే అధ్యక్షుడిగా కొనసాగేలా రాజ్యాంగంలో మార్పులు చేసుకొన్నారు.