తెలంగాణ

telangana

ETV Bharat / international

వణుకుపుట్టించే చలిలో గుర్రపు పోటీల మజా! - Winter Season Horse race

చలి ఎక్కువగా ఉంటే ఇంటి నుంచి బయటకు రావడానికే ఎంతో ఆలోచిస్తాం. వాహనం నడపాలంటే ఎంతో జాగ్రత్తగా ఉంటాం. అలాంటిది మంచుపై గుర్రపు పోటీలు నిర్వహిస్తే.. అమ్మో! అనాల్సిందే. ఫిన్లాండ్​లో రొవానియేమి నగరంలో 'ఆర్కిటిక్​ హార్స్​ రేస్​' వేడుకల్లో రేసర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రేక్షకులను అలరిస్తున్నారు. వణుకుపుట్టించే చలిలో గుర్రపు స్వారీలు చేయడమే ఈ పోటీల్లోని అసలైన మజా.!

The first-ever Arctic Horse Race
వణుకుపుట్టించే చలిలో గుర్రపు పోటీల మజా!

By

Published : Dec 28, 2019, 3:02 PM IST

వణుకుపుట్టించే చలిలో గుర్రపు పోటీల మజా!

ఐరోపాలోని ఎన్నో సుందరమైన నగరాల్లో ఫిన్లాండ్​ ఒకటి. అందమైన ప్రదేశాలతో పాటు ఇక్కడ మంచు కూడా ఎక్కువే. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కోసారి మైనస్​ 25 డిగ్రీల కంటే తక్కువగా ఉంటాయి. అంతటి తీవ్రమైన చలిలోనే రొవానియేమి నగరంలో మంచు ట్రాక్​పై గుర్రపు పోటీలు నిర్వహిస్తున్నారు. ఇలా మంచుపై పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ పోటీలకు 'ఆర్కిటిక్​ హార్స్​ రేస్​' అని పేరు. శాంటాక్లాజ్​ సొంత పట్టణంగా పేరొందిన ఈ రొవానియేమిలోని హార్స్​ రేస్​ సెంటర్​ ఈ పోటీలను ఏర్పాటు చేసింది.

ఏటా రొవానియేమిను సుమారుగా 5లక్షలమంది సందర్శిస్తారు. మంచులో గుర్రపు పోటీలను వీక్షించడానికి పర్యటకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా ఇలాంటి పోటీల్లో రేసర్లు గుర్రంపై కూర్చుంటారు. కానీ ఇక్కడ... గుర్రం వెనకాల ఏర్పాటుచేసిన చిన్న ఆధారంపై కూర్చొని రైడ్ చేయాలి. దీనిని హార్నెస్​ డ్రైవింగ్​ అంటారు. అయితే వృత్తాకార వలయంలో ఉండే ఈ ట్రాక్​పై స్వారీ చేయడం కత్తి మీద సాములా ఉంటుంది. దట్టమైన పొగమంచు, తీవ్రమైన చలి... గుర్రం, డ్రైవర్​లను ఎంతో ఇబ్బంది పెడతాయి.

ఈ పోటీల కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించినట్టు ఆ ప్రాంతంలోని ప్రముఖ బెట్టింగ్​ సంస్థ సభ్యుడు ఇల్కా నిసులా తెలిపారు.

"ఇది రైడర్లకు ఓ పెద్ద సవాల్​. ఈ పోటీలో 12 మంది డ్రైవర్లు మూడు రైడ్​లలో పాల్గొంటారు. ఈ మూడు రౌండ్లలో మంచి ప్రదర్శన కనబరిచిన వారే విజేతగా నిలుస్తారు."

- ఇల్కా నిసులా, వెయిక్కాస్​ బెట్టింగ్​ కంపెనీ

మంచు ట్రాక్​పై హార్స్​ రేస్​లో పాల్గొనడం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తునట్టు అమెరికా నుంచి వచ్చిన హార్నెస్​ రేసింగ్​ డ్రైవర్ టిమ్​ టెట్రిక్​​ తెలిపాడు.

"ఇలాంటి ప్రాంతాల్లో చలికి రక్తం గడ్డకడుతుంది. ఈ పరిస్థితుల్లో హార్స్​ రేసింగ్​ చేయడం ఎంతో భిన్నం. నేనెప్పడూ మంచు ట్రాక్​పై స్వారీ చేయలేదు. కానీ ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. పోటీల్లో విజయం సాధించడమే ప్రధాన లక్ష్యం."

- టిమ్​ టెట్రిక్​, హార్స్​ రైడర్​

రేసులో పాల్గొనేటప్పుడు రైడర్​ దృష్టంతా లక్ష్యంపైనే ఉండాలి. ప్రమాదకరంగా రైడ్​ చేస్తూ... కొన్నిసార్లు ట్రాక్​పై జారిపడే అవకాశముంది. మంచుపై పరుగెత్తేందుకు వీలుగా... గుర్రాలకు ప్రత్యేక బూట్లు అమర్చారు. ఐరోపా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​ దేశాల్లో ఈ హార్నెస్​ రేసింగ్​ ప్రసిద్ధి. అయితే పర్యటకులు కొత్తదనం కోరుకుంటారని, ఈ మంచు ట్రాక్​పై గుర్రపు పందేలు వారికి మంచి అనుభూతినిస్తుందని నిర్వహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ఇరాన్​ అణు విద్యుత్​ కేంద్రం సమీపంలో భూకంపం

ABOUT THE AUTHOR

...view details