తెలంగాణ

telangana

ETV Bharat / international

ఊరించి.. ఉసూరుమనిపించిన కాప్-25 సదస్సు - కాప్ 25 సదస్సు తుది ఫలితం

స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ వేదికగా ఈ నెల జరిగిన కాప్-25 సదస్సు కర్బన ఉద్ఘారాల తగ్గింపు దిశగా మార్గదనిర్దేశనం చేయకుండానే ముగిసిపోయింది. ప్రపంచ దేశాలకు దిక్సూచీలా మారుతుందని ఆశించిన సదస్సు నిరాశపర్చింది. పారిస్ వాతావరణ ఒప్పందానికి మాడ్రిడ్ సదస్సు తుదిరూపునిస్తుందని ఆశించినప్పటికీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. దీనికి ప్రధానంగా ఐదు కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

The Cop25 summit, held this month in Spain's capital, Madrid, ended without any guidance on reducing carbon emissions.
ఊరించి.. ఉసూరుమనిపించిన కాప్-25 సదస్సు

By

Published : Dec 26, 2019, 8:31 AM IST

పుడమి పరిరక్షణలో ప్రపంచ దేశాలకు దిక్సూచీలా మారుతుందని ఆశించిన 'కాప్‌-25' సదస్సు ఉసూరుమనిపించింది. కర్బన ఉద్గారాల తగ్గింపు దిశగా స్పష్టమైన మార్గనిర్దేశనం చేయకుండానే ముగిసిపోయింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో స్పెయిన్‌ రాజధాని మ్యాడ్రిడ్‌ వేదికగా ఈ నెల్లోనే సదస్సు జరిగింది. భూతాపం పెరుగుదలను నియంత్రించి, మానవాళి భవిష్యత్తును పదిలం చేయడమే లక్ష్యంగా పారిస్‌ సదస్సు(2015)లో కుదిరిన ఒప్పందానికి మాడ్రిడ్‌ సదస్సు తుది రూపునిస్తుందని అంతా భావించారు. కర్బన ఉద్గారాలను సమర్థంగా కట్టడి చేసే నిబంధనల రూపకల్పనకు వేదికగా నిలుస్తుందని ఆశించారు. అవేవీ తాజా సదస్సులో కార్యరూపం దాల్చలేదు. ఇందుకు ప్రధానంగా ఐదు కారణాలు ఉన్నాయన్నది విశ్లేషకుల వాదన.

వందల మంది లాబీయిస్టులు

కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రణాళికల రూపకల్పన 'కాప్‌-25'లో కీలకాంశం. అయితే- తాజా సదస్సులో పాల్గొనేందుకు దాదాపు 30 వేల మంది దౌత్యవేత్తలు, నిపుణులు, పర్యావరణ కార్యకర్తలు, ప్రముఖులకు అనుమతి లభించగా.. అందులో హై-ఆక్టేన్‌ శిలాజ ఇంధనాల లాబీయిస్టులే కొన్ని వందల మంది ఉన్నారు. ఆ ఇంధనం పర్యావరణానికి హాని కలిగించేది కావడం గమనార్హం. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సదస్సులో వారు పాల్గొంటే ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు!

చైనా మౌనం

ప్రపంచంలో అత్యధికంగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ను వాతావరణంలోకి విడుదల చేస్తున్న దేశం చైనా. తర్వాతి స్థానాల్లో వరుసగా అమెరికా, రష్యా, భారత్‌ ఉన్నాయి. తన తర్వాత ఉన్న మూడు దేశాలు సంయుక్తంగా వాతావరణంలోకి విడుదల చేసే కార్బన్‌ డై ఆక్సైడ్‌తో పోలిస్తే ఒక్క చైనా ఉద్గారాలే ఎక్కువ. ఈ నేపథ్యంలో 2030 కల్లా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకుంటామంటూ పారిస్‌ ఒప్పంద సమయంలో చైనా స్వచ్ఛందంగా ముందుకు రావడం అందరికీ సంతోషం కలిగించింది. అయితే- లక్ష్య సాధనకు సంబంధించి తాజా సదస్సులో చైనా మౌనం పాటించింది. పారిస్‌ ఒప్పంద సమయంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సడలించుకునే దిశగా సంకేతాలిచ్చింది.

స్వప్రయోజనాలకే పెద్దపీట

ప్రపంచ ప్రయోజనాలతో పోలిస్తే స్వలాభాలకే కొన్ని దేశాలు ప్రాధాన్యమిస్తుండటం పర్యావరణ పరిరక్షణ చర్చలకు విఘాతం కలిగిస్తోంది. జాతీయవాదం, సొంత ఆర్థిక వ్యవస్థలను కాపాడుకునేందుకే అవి కృషి చేస్తున్నాయి. ఫ్రాన్స్‌, కొలంబియా, చిలీ, ఈక్వెడార్‌, ఈజిప్ట్‌ సహా పలు దేశాల్లో జీవన వ్యయం పెరగడంపై ఇప్పటికే తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ కర్బన ఉద్గారాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా దేశాలు మొగ్గుచూపట్లేదు.

ట్రంప్‌ దెబ్బ

పారిస్‌ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంటుందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండేళ్ల క్రితమే ప్రకటించారు. ఆ ప్రభావం తాజా సదస్సుపై స్పష్టంగా కనిపించింది. అమెరికాలో డెమోక్రాట్ల ప్రభుత్వం ఆమోదం తెలిపిన పర్యావరణ ఒప్పందం నుంచి తప్పుకోవాలని రిపబ్లికన్‌ పాలకులు నిర్ణయించడం ఇది రెండోసారి. గతంలో క్యోటో ప్రొటోకాల్‌ విషయంలోనూ ఇలాగే జరిగింది.

ఆతిథ్యం.. ప్చ్‌!

ఏదైనా ప్రపంచ స్థాయి సదస్సు విజయవంతమవ్వాలంటే ఆతిథ్య దేశం నైపుణ్యాలు, సామర్థ్యాలు కీలకం. 2015 నాటి పారిస్‌ సదస్సులో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రపంచ దేశాలు పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఫ్రాన్స్‌ దౌత్యం ప్రధాన భూమిక పోషించింది. తాజా సదస్సులో అలాంటి పాత్ర పోషించడంలో స్పెయిన్‌ సఫలీకృతం కాలేకపోయింది.

  • 29 శాతం-ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న కార్బన్‌ డై ఆక్సైడ్‌ పరిమాణంలో చైనా వాటా
  • 1000 కోట్ల టన్నులు-2018లో వాతావరణంలోకి చైనా నుంచి విడుదలైన కార్బన్‌ డై ఆక్సైడ్‌ పరిమాణం. 1998లో ఈ విలువ 320 కోట్ల టన్నులుగా నమోదైంది.
  • గ్లాస్గో (స్కాట్లాండ్‌)- వచ్చే ఏడాది జరగనున్న కాప్‌-26 సదస్సుకు వేదిక

ABOUT THE AUTHOR

...view details