బంగారు టాయ్‌లెట్‌ను దొంగలెత్తుకెళ్లారు..! ఆక్స్ఫర్డ్షైర్లోని ప్రఖ్యాత బెన్హేమ్ ప్యాలెస్ మ్యూజియంలో దొంగలు పడ్డారు. ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్ 18క్యారెట్లబంగారంతో తయారు చేసిన టాయ్‌లెట్‌ను దుండగులు దొంగలించేశారు.
శుక్రవారం భారీ సంఖ్యలో సందర్శకులు రావడం వల్ల దోపిడీకి ఆస్కారం ఏర్పడిందని పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. దీని విలువ సుమారు 8.8 కోట్లు ఉండొచ్చని సమాచారం. ఘటనతో సంబంధమున్నట్లు భావిస్తున్న 66 ఏళ్ల వృద్ధురాలిని అరెస్టు చేసినట్లు తెలిపారు పోలీసులు. అనేక కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
మనసు పారేసుకున్న ట్రంప్..
సందర్శకులతో ఎప్పుడూ కిటకిటలాడే బెన్హేమ్ ప్రాసాద ప్రదర్శనశాలను దొంగతనం అనంతరం తాత్కాలికంగా మూసేశారు. 2016లో మౌరిజియో కాటిలాన్ బంగారు టాయ్‌లెట్ ఆర్ట్‌వర్కును న్యూయార్క్‌లోని గుగెన్‌హైమ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. రెండు రోజుల క్రితమే దీనిని లండన్ తీసుకొచ్చారు. అక్టోబర్ 27 వరకు ఈ కళాఖండాన్ని బెన్హేమ్ ప్యాలెస్‌లో ఉంచాలని భావించారు నిర్వాహకులు.
న్యూయార్క్‌లో ఉన్నప్పుడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై మనసు పారేసుకున్నారు. బంగారు టాయ్‌లెట్‌ను ఇస్తే అందుకు బదులుగా విన్నెంట్ వాన్గో 1888లో వేసిన విఖ్యాత ల్యాండ్‌స్కేప్ విత్ స్నో పెయింటింగ్ఇస్తానని ట్రంప్ చెప్పడం విశేషం.
ఇదీ చూడండి:భారీ వరదలకు స్పెయిన్ అతలాకుతలం