తెలంగాణ

telangana

ETV Bharat / international

'డెల్టా వ్యాప్తితో ప్రపంచానికి పెను ముప్పు!' - ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వేరియంట్ ఉద్ధృతి

డెల్టా వేరియంట్(Delta variant)​ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు(Corona cases) విపరీతంగా పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వేరియంట్​ వల్ల ఆరోగ్య రంగంపై తీవ్ర ఒత్తిడి పడుతుందని చెప్పింది. మంగళవారం నాటికి 111 దేశాల్లో ఈ వెేరియంట్​ను గుర్తించినట్లు పేర్కొంది.

delta variant
డెల్టా వేరియంట్​

By

Published : Jul 14, 2021, 1:25 PM IST

కరోనా డెల్టా వేరియంట్(Delta variant)​ విజృంభణ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్​ కేసుల(Covid cases) సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) హెచ్చరించింది. విస్తృత స్థాయిలో టీకా పంపిణీ ప్రక్రియ చేపట్టకపోవడం వల్ల వైద్యవ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన వీక్లీ కొవిడ్​-19 నివేదికలో పేర్కొంది.

జులై13 వరకు 111 దేశాల్లో డెల్టా వేరియంట్​ వ్యాపించిందని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. ఈ వేరియంట్​ కారణంగా కేసుల్లో పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. రానున్న నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ వేరియంట్​ ఆదిపత్య వేరియంట్​గా మారుతుందని అంచనా వేసింది.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • ప్రపంచ వ్యాప్తంగా 178 దేశాల్లో ఆల్ఫా వేరియంట్​ గుర్తింపు.
  • 123 దేశాల్లో బీటా వేరియంట్​ కేసులు నమోదు.
  • 75 దేశాల్లో గామా వేరియంట్​ వ్యాప్తి.
  • మిగతా ఆందోళనకర వేరియంట్ల(variants of concerns) కన్నా డెల్టా వేరియంట్​ ఉద్ధృతి అధికంగా ఉంది.
  • చాలా దేశాల్లో కొవిడ్ నిబంధనల్లో సడలింపులు ఇవ్వటం, ఎక్కువ మందికి టీకా పంపిణీ చేయకపోవడం వల్ల.. కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, మృతుల సంఖ్య ఎక్కువవుతోంది.
  • చాలా ప్రాంతాల్లో వైరస్​ వ్యాప్తిపై పర్యవేక్షణ కొరవడుతోంది. ఫలితంగా ప్రస్తుతం, భవిష్యత్​లో విజృంభించే వేరియంట్లపై అప్రమత్తత లేకుండా పోతోంది.

వ్యాక్సినేషన్​లో అసమానతలు..

ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ జరిగిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ప్రపంచ జనాభాలో.. దాదాపు మూడో వంతు మంది(24.7శాతం).. కొవిడ్​ టీకా మొదటి డోసు తీసుకున్నారని చెప్పింది. సంపన్న, మధ్య ఆదాయ దేశాల్లోనే ఎక్కువ మందికి టీకా అందిందని చెప్పింది. టీకా పంపిణీలో అసమానతలను తొలగించే దిశగా 'కొవాక్స్'​ కార్యక్రమం కొనసాగుతోందని పేర్కొంది.

10శాతం పెరుగుదల..

జులై5 నుంచి జులై 11 వరకు ప్రపంచ వ్యాప్తంగా ముప్పై లక్షల కరోనా కేసులు వెలుగు చూసినట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. అంతకుముందు వారంతో పోలిస్తే కేసుల సంఖ్య 10శాతం పెరిగినట్లు చెప్పింది. జులై 5 నుంచి 11 వరకు 55 వేల మంది కరోనా ధాటికి ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఇది అంతకుముందు వారంతో పోలిస్తే 3శాతం అధికమని చెప్పింది.

ఇదీ చూడండి:Vaccine Mixing: ' రెండు వేర్వేరు టీకాలు కలిపితే అంతే!'

ఇదీ చూడండి:ఆ టీకా తీసుకుంటే అతికొద్ది మందికి అరుదైన వ్యాధి!

ABOUT THE AUTHOR

...view details