గతవారం స్పెయిన్‌లో బద్దలైన లా పాల్మా దీవుల్లోని కంబర్ వీజా అగ్నిపర్వతం (La Palma Volcano) నుంచి అగ్నికీలలు ఎగసిపడుతూనే (Spain Volcano Eruption) ఉన్నాయి. 1971 తర్వాత మరోసారి బద్దలైన ఈ అగ్నిపర్వతం నుంచి లావా భారీగా (Spain Volcano Eruption 2021) బయటకు విడుదలవుతోంది. భగభగ మండుతున్న నదిని తలపిస్తున్న కంబర్ వీజా అగ్ని పర్వత లావా.. పాయలుగా వీడిపోయి దీవిలోని ఇళ్ల వైపునకు దూసుకెళ్తోంది. అడ్డొచ్చిన చెట్టు పుట్టా, గడ్డీ గాదం, ఇళ్లు రోడ్లను దహించేస్తూ ముందుకు సాగుతోంది. లావా దెబ్బకి దీవిలోని వందలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. దాదాపు 6వేల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అయితే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న లావా మంగళవారం నుంచి సముద్రంలో (La Cumbre Vieja eruption) కలుస్తుండటం తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. లావా నీటిలో కలవడం ద్వారా రసాయనిక చర్య జరిగి విషవాయువులు విడుదల అవుతున్నాయి. వేడి లావా చల్లటి సముద్ర నీటిలో కలిసినప్పుడు హైడ్రో క్లోరికామ్లం విడుదలవుతుందని అగ్నిపర్వత శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది వెంటనే వాయు రూపంలోకి రూపాంతరం చెందట వల్ల అగ్నిపర్వత శిథిలాలు గాల్లోకి విడుదలవుతాయని పేర్కొన్నారు. ఒకవేళ ఆ విషవాయువుని ఎవరైనా పీలిస్తే వారి చర్మం, కళ్లు మండటంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.