ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న సమయంలో ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ వంటి దేశాలు మాత్రం వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలిగాయి. అంతేకాకుండా అక్కడ వ్యాక్సిన్ పంపిణీని వేగంగా చేపడుతున్నాయి. ఈ సమయంలో కొత్తగా వచ్చిన డెల్టా వేరియంట్ మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. దీంతో అప్రమత్తమైన ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ దేశాలు తాజాగా మరోసారి ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించాయి. సిడ్నీలో వారంపాటు లాక్‌డౌన్ విధించారు. డెల్టా వేరియంట్ ఆఫ్రికాలోనూ విలయం సృష్టిస్తున్నట్లు అక్కడి సీడీసీ వెల్లడించింది. ఇప్పటికే డెల్టా వేరియంట్ దాటికి భారత్ కూడా వణికిపోయిన విషయం తెలిసిందే.
సిడ్నీలో లాక్‌డౌన్..
కరోనా నుంచి కోలుకుంటున్నామని భావిస్తున్న తరుణంలో కొత్తగా వెలుగుచూసిన డెల్టా వేరియంట్ ఆస్ట్రేలియాను కలవరపెడుతోంది. దీంతో సిడ్నీలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒకవారం పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించింది. ఆస్ట్రేలియాలో గతవారంలోనే 65 పాజిటివ్ కేసులను గుర్తించారు. కరోనా మహమ్మారి బయటపడిన తర్వాత అత్యంత భయంకరమైన పరిస్థితిని ఇప్పుడే చూస్తున్నామని న్యూసౌత్‌వేల్స్ ప్రీమియర్ గ్లాడీస్ బెరెజిక్లెయిన్ పేర్కొన్నారు.
ఇండోర్‌లోనూ మాస్కులు: ఇజ్రాయెల్
ప్రపంచంలో అత్యధిక వేగంగా టీకా పంపిణీ చేస్తున్న దేశాల్లో ఇజ్రాయెల్ ముందున్న విషయం తెలిసిందే. దీంతో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఇండోర్ ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని పదిరోజుల క్రితం ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకున్న నాలుగు రోజులకే నిత్యం వంద కేసులు బయటపడడం మొదలయ్యింది. కేవలం గురువారం ఒక్కరోజు 227 కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్, మాస్కుల నిబంధన సడలింపును ఎత్తివేసింది. ఇండోర్ ప్రాంతంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. అంతేకాకుండా పరిస్థితిని బట్టి మరిన్ని ఆంక్షలు విధించాలని యోచిస్తోంది. దేశంలో వైరస్ విజృంభణకు డెల్టా వేరియంట్ కారణం కావచ్చని ఇజ్రాయెల్‌లో కరోనాపై ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్ చీఫ్ పేర్కొన్నారు.