కొవిడ్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై, ఆసుపత్రుల్లో చేరి, వెంటిలేటర్‌పై ఉండి చికిత్స పొందినవారు... కోలుకున్న తర్వాత తెలివితేటలకు సంబంధించిన సమస్యను ఎదుర్కొంటున్నట్టు తాజా పరిశోధనలో తేలింది. ఏకాగ్రత లోపించడం, సమస్యలకు పరిష్కారాలు వెతకలేకపోవడం, పరిస్థితులకు తగ్గట్టు సరైన పదాలను ఉచ్ఛరించలేకపోవడం వంటి సమస్యలు వారిలో తలెత్తుతున్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్, కేంబ్రిడ్జ్, సౌతాంప్టన్, షికాగో వర్సిటీల పరిశోధకులు ఇందులో పాల్గొన్నారు. ద లాన్సెట్ పత్రిక... ‘కాగ్నిటివ్ డిఫెక్ట్స్ ఇన్ పీపుల్ హూ హావ్ రికవర్డ్ ఫ్రం కొవిడ్-19’ పేరున ఈ వివరాలను ప్రచురించింది. పరిశోధనలో భాగంగా గత ఏడాది జనవరి-డిసెంబరు మధ్య మొత్తం 81,337 మంది కొవిడ్ బాధితులను శాస్త్రవేత్తలు పరీక్షించారు.
తీవ్రస్థాయి కొవిడ్ బాధితుల్లో మందగిస్తున్న తెలివితేటలు! - కరోనా అనంతరం సమస్యలు
కరోనా నుంచి కోలుకున్న వారిలో తెలివితేటలు మందగిస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఏకాగ్రత లోపించడం, సమస్యలకు పరిష్కారాలు వెతకలేకపోవడం, పరిస్థితులకు తగ్గట్టు సరైన పదాలను ఉచ్ఛరించలేకపోవడం వంటి సమస్యలు వారిలో తలెత్తుతున్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
వయసు, చదువు, మగ-ఆడ, ఆదాయం, జాతి, అలసట, వ్యాకులత, ఇతరత్రా అనారోగ్య సమస్యలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. గ్రేట్ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ టెస్ట్‌లో భాగంగా వారికి వెబ్ ఆధార క్లినికల్ పరీక్షలు నిర్వహించారు. ‘‘తీవ్రస్థాయి కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో తార్కిక, భావోద్వేగ సంబంధ మానసిక ప్రక్రియలు మందగించినట్టు తెలుస్తోంది. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధ సమస్యల కారణంగానే 4.8% మంది బాధితులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు’’ అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Delta Variant: వెయ్యి రెట్లు ఎక్కువగా వైరస్ వ్యాప్తి!