నడివయసులో రాత్రి నిద్ర తగ్గితే డిమెన్షియా వంటి తీవ్ర మతిమరపు సమస్యల ముప్పు పెరుగుతుందని బ్రిటన్‌లో నిర్వహించిన దీర్ఘకాల అధ్యయనం హెచ్చరించింది. వయసు మీదపడే క్రమంలో జ్ఞాపక శక్తికి నిద్రకు మధ్య ఉన్న లంకెను ఈ పరిశోధన వెలుగులోకి తెచ్చిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
కనీసం 7 గంటలు..
50, 60 ఏళ్ల వయసు వారిలో రాత్రివేళ 6 గంటలకన్నా తక్కువ సమయం నిద్రించేవారికి.. రోజుకు కనీసం ఏడు గంటలు నిద్రపోయేవారితో పోలిస్తే డిమెన్షియా ముప్పు 30 శాతం ఎక్కువని వారు తెలిపారు. సాధారణంగా మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ రుగ్మత తలెత్తుతుంటుంది. ఇవేవీ లేనివారిలోనూ డిమెన్షియా రావడానికి కారణం.. నిద్రలేమేనని శాస్త్రవేత్తలు వివరించారు. 1985 నుంచి దాదాపు 8వేల మందిపై పరిశోధన చేసిన యూనివర్సిటీ కాలేజీ లండన్ (యూసీఎల్) శాస్త్రవేత్తలు ఈ వివరాలను వెల్లడించారు.