కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇంకా లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ ఎక్కువ శాతం ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే లాక్‌డౌన్ కారణంగా షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, రెస్టారెంట్లు.. ఇలా జనసందోహం ఎక్కువగా ఉండే ప్రాంతాలన్నీ మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ సామాజిక దూరం పాటించాలి, ఒక్కరే రావాలి అనే నియమాలతోనే ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు స్వీడన్‌కు చెందిన ఓ జంట. రెస్టారెంట్లో సామాజిక దూరం.. అదెలా సాధ్యం అనేగా మీ సందేహం? అయితే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే..
రాస్మస్ పెర్సన్, లిండా కార్ల్‌సన్.. స్వీడన్‌లోని వార్మ్‌లాండ్ కౌంటీకి చెందిన ఈ భార్యాభర్తలు మే 10న 'టేబుల్ ఫర్ వన్' పేరుతో ఓ రెస్టారెంట్‌ని ప్రారంభించారు. అసలే స్వీడన్‌లో కేసులు ఎక్కువ అవుతుంటే వీళ్లు రెస్టరంట్ ఎలా ప్రారంభిస్తారు? అలా అయితే సామాజిక దూరం పాటించడం ఎలా సాధ్యమవుతుంది? అని ఆలోచిస్తున్నారా? అలాంటి భయాలేవీ లేకుండా అటు సామాజిక దూరం పాటిస్తూనే ఇటు రెస్టారెంట్‌ను ప్రారంభించాలన్న ఆలోచన చేసిందీ జంట.
వినూత్న ఐడియా...
లాక్‌డౌన్ సమయంలో కార్ల్‌సన్ తల్లిదండ్రులు వారి ఇంటికి వచ్చారు. ఇల్లు కాస్త చిన్నదిగా ఉండడంతో.. అందులోనూ కరోనా సామాజిక దూరం పాటించాల్సి రావడం వల్ల రాస్మస్ ఇంటి పక్కన ఉన్న పొలంలో భోజనం ఏర్పాట్లు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ఇలా భోంచేయడం ఎంతో ఆహ్లాదంగా ఉందని భావించిన రాస్మస్ ఈ 'టేబుల్ ఫర్ వన్' రెస్టరంట్‌కి నాంది పలికాడు.