నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కొవిడ్ వ్యాధి తీవ్రతను తగ్గించుకోవచ్చునని ఓ తాజా అధ్యయనం తేల్చింది. విపణిలో ప్రస్తుతం తక్కువ ధరకే అందుబాటులో ఉన్న పలు మౌత్ వాష్‌లు (నోటిని శుభ్రం చేసే ద్రావణాలు) కరోనా వైరస్‌ను క్రియారహితంగా మార్చడంలో సఫలమవుతున్నాయనీ వెల్లడించింది. కొవిడ్ వ్యాధి తీవ్రత, నోటి ఆరోగ్యం మధ్య సంబంధాన్ని నిర్ధరించేందుకు బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో కూడిన బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.
నోటి శుభ్రతతో కరోనా తీవ్రతకు కళ్లెం! - కొవిడ్
నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కరోనా తీవ్రతను తగ్గించుకోవచ్చని ఓ అధ్యయనం చెబుతోంది. వైరస్‌ను క్రియారహితంగా మార్చడంలో మౌత్ వాష్‌లు సఫలమవుతున్నాయనీ వెల్లడించింది.
వ్యక్తుల్లో చిగుర్ల సంబంధిత వ్యాధులు ఉంటే.. లాలాజలం నుంచి కరోనా వైరస్ రక్త ప్రవాహంలోకి ప్రవేశించి, క్రమంగా ఊపిరితిత్తులకు సులభంగా చేరుతున్నట్లు తాము గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా బారిన పడిన తొలినాళ్లలో.. వాయునాళాలతో పోలిస్తే ఈ మార్గంలోనే ఊపిరితిత్తుల్లోకి వైరస్ అధికంగా వెళ్తోందని పేర్కొన్నారు. కాబట్టి సరిగా బ్రష్ చేసుకోవడం, దంతాలపై పాచి పేరుకుపోకుండా చూసుకోవడం, అప్పుడప్పుడు ఉప్పునీటితో పుక్కిలించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా నోటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే కొవిడ్ తీవ్రతను తగ్గించుకోవచ్చునని వివరించారు. ప్రాణాపాయ ముప్పును అది తగ్గిస్తుందని తెలిపారు.
ఇదీ చూడండి:అన్ని కరోనా వైరస్‌లపై ఒకే టీకా!