ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్ వినియోగించేందుకు శాస్త్రవేత్తలు ఈ ఏడాది అద్భుతమైన ఆవిష్కరణలు జరిపారు. అయితే వీటన్నింటిని కరోనా విపత్తు ప్రశ్నార్థకంగా మిగిల్చింది. కరోనా వైరస్ ముప్పుతో... ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులకు పెద్దఎత్తున డిమాండ్ పెరిగింది. వ్యక్తిగత రక్షణ సూట్లు, ఫేస్ షీల్డ్‌లు, మాస్కులు ఇలా కొవిడ్ నుంచి రక్షణ కల్పించే వస్తువులన్నీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తోనే తయారవుతున్నాయి. కరోనా పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ప్లాస్టిక్ భూతానికి కోరలు తొడిగినట్లేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ప్లాస్టిక్ భూతం అంతానికి సూపర్ ఎంజైమ్..
జనాభాతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలూ పెరుగుతున్నాయి. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్, సోడా క్యాన్లు, వాటర్ బాటిళ్లు పర్వతాల్లా పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్ కాలుష్యం సర్వత్రా విస్తరించింది. ప్లాస్టిక్‌లోని రసాయనాలు గాలిని, నీటిని, భూమిని విషతుల్యం చేస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను వదిలించుకోవడం మానవాళికి ఓ పెను సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో...శాస్త్రవేత్తల ఆవిష్కరణలు కాసింత ఊరటనిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను తినే ఎంజైమ్‌లపై పరిశోధనలను శాస్త్రవేత్తలు వేగవంతం చేశారు. బ్రిటన్, అమెరికా శాస్త్రవేత్తలు పాలిథిలిన్ టెరాఫ్తలెట్ పీఈటీ, మోనో -2-హైడ్రాక్సి ఇథైల్ టెరెఫ్తాలేట్ ఎమ్హెచ్ఈటీ ఎంజైమ్‌లను కలిపి శక్తిమంతమైన 'సూపర్ ఎంజైమ్'ను సృష్టించారు.
ఇదివరకు ప్లాస్టిక్ వ్యర్థాలను నాశనం చేయాలంచే పీఈటీ ఎంజైమ్‌ను ఉయోగించేవారు కానీ ఈ సూపర్ ఎంజైమ్ రాకతో ప్లాస్టిక్ వ్యర్థాలను పీఈటీ కంటే 6 రెట్లు వేగంగా విచ్ఛిన్నం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వాషింగ్ మిషన్‌లు పనిచేసే క్రమంలో అతిసూక్ష్మమైన దారపు పోగులను విడుదల చేస్తాయని బ్రిటన్ పరిశోధకులు తెలిపారు. ఏడాదిలో ఈవిధంగా దాదాపు ఏడు లక్షల సూక్ష్మపోగులు మురికి నీటి ద్వారా జలాశయాల్లో కలుస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా రోజూ మనం ఉపయోగించే వాహనాల వల్ల కూడా ప్లాస్టిక్ ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
రోడ్లపై వాహనాలు వెళ్లే క్రమంలో...టైర్లు అరిగి హానికరమైన దూళి కణాలు గాలిలోకి వ్యాపిస్తున్నాయని నిపుణులు హెచ్చరించారు. వీటి పరిమాణం 2.5 పీఎమ్ ఉంటుందని వివరించారు. ఈ ప్రక్రియను ఓ ప్రోటోటైప్ పరికరం ద్వారా పరిశోధకులు నిరూపించారు. ఈ హానికర మసికణాల వల్ల ఏటా లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్నారని ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని పరిశోధకులు వివరించారు.
"టైర్లకు రహదారి మధ్య ఘర్షణ తలెత్తి ధనాత్మక సూక్ష్మకణాలు గాల్లోకి ఎగురుతున్నట్లు మేము కనుగొన్నాం. తిరుగుతున్న చక్రం చుట్టూ ఎలెక్ట్రోస్టాటిక్స్ ఉపయోగించి ఈ సూక్ష్మ రేణువులను సేకరించాం".
-సియోభన్ ఆండర్సన్, పరిశోధకురాలు
కొవిడ్ రాకతో ప్లాస్టిక్ వినియోగం మరింత శ్రుతిమించింది. మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యక్తిగత రక్షణ సామగ్రి, మాస్కులు, శానిటైజర్ బాటిళ్లు వాడాల్సి వస్తోంది. ఇవన్నీ కలిపితే తయారయ్యే వ్యర్థం అంతా ఇంతా కాదు.
2018 ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం... వాడిపడేసిన పీపీఈ కిట్‌లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాలు దాదాపు 13 మిలియన్లు ఏటా సముద్రంలో కలుస్తున్నాయి. కరోనా మహమ్మారి వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువైందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అందుకే వస్త్రంతో చేసిన మాస్కులు, త్వరగా విచ్ఛిన్నం అయ్యే పదార్థాల ద్వారా తయారయ్యే మాస్కుల వాడకాన్ని శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు.