యావత్ మానవాళిని వణికిస్తోన్న కరోనా వైరస్ మూలాలపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, చైనాలో బయటపడ్డ కొవిడ్ మహమ్మారి తొలుత గబ్బిలాల నుంచి మానవులకు సోకిందనే వార్తలు వచ్చాయి. కానీ, దీనికి ఎటువంటి రుజువులు లభించలేదు. ఈ నేపథ్యంలో కొవిడ్-19కు కారణమైన నావెల్ కరోనా వైరస్ రకాన్ని బ్రిటన్ గబ్బిలాల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు.
కరోనా వైరస్ మూలాలు..
చైనాలో వెలుగు చూసిన కొవిడ్-19కి కారణమైన వైరస్ మూలాలను కనుగొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా (యూఈఏ), జువాలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ (జెడ్ఎస్ఎల్), పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ) సంస్థలు సంయుక్తంగా పరిశోధన చేపట్టాయి. ఇందుకోసం శాస్త్రవేత్తలు 50 గబ్బిలాల మలసంబంధమైన నమూనాలను సేకరించి విశ్లేషించారు. వీటికి జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టగా ఒక నమూనాలో నావెల్ కరోనా వైరస్ మూలాలు ఉన్నట్లు గుర్తించారు. దీనికి 'ఆర్హెచ్బీB01' అనే పేరు పెట్టారు. సార్స్‌కు సంబంధించిన వైరస్ గబ్బిలాల్లో తొలిసారి వెలుగు చూసిందని.. బ్రిటన్ గబ్బిలాల్లో కనిపించడం కూడా ఇదే మొదటిసారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.