ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా వైరస్ నియంత్రణపై చర్చించేందుకు నేడు జీ-20 దేశాల అధినేతలు సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్నారు.
అత్యసవరంగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నేతృత్వం వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, ఆర్థిక వ్యవస్థలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్న మహమ్మారిని నిరోధించేందుకు సమన్వయంతో ఎలా పనిచేయాలన్న విషయమై వీరంతా చర్చిస్తారు.
ఎదురుచూస్తున్నా..
జీ-20 సమావేశం కోసం ఎదురు చూస్తున్నానని, కొవిడ్-19 మహమ్మారి నివారణకు అంతర్జాతీయంగా ఎలాంటి పాత్ర పోషించాలన్న విషయమై ఈ సందర్భంగా చర్చిస్తామని మోదీ ట్వీట్ చేశారు. ఇందులో జీ-20 నేతలతో పాటు ఆహ్వానిత దేశాలైన స్పెయిన్, జోర్డాన్, సింగపూర్, స్విట్జర్లాండ్ ప్రతినిధులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.