కరోనా కేసుల కట్టడిలో తొలుత భేషుగ్గా అనిపించిన రష్యాలో ప్రస్తుతం పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు కనిపిస్తోంది. గత రెండు రోజుల్లోనే దేశవ్యాప్తంగా 10,328 కేసులు నమోదవగా రాజధాని నగరం మాస్కోలోనే 5,596 కేసులున్నాయి. ఇప్పటివరకు రష్యాలో మొత్తం 47,121 కేసులు, 405 మరణాలు నమోదయ్యాయి. అందులో అధికభాగం మాస్కోలో 26,350 కేసులు, 204 మరణాలు ఉండటం గమనార్హం. మున్ముందు మరింత గడ్డుకాలం ఉందని, వచ్చే రెండు, మూడు వారాల్లో కేసులు గరిష్ఠంగా నమోదయ్యే అవకాశం ఉందని మాస్కో డిప్యూటీ మేయర్ అనస్తాసియా రకోవా చెప్పడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.
బాధితులను తీసుకెళ్తున్న అంబులెన్సులు లాక్‌డౌన్ ఆలస్యమే కారణమా?
రష్యాలో తొలికేసు జనవరి 31 నమోదవగా.. మాస్కోలో మార్చి 6 నుంచి మొదలయ్యాయి. ప్రభుత్వం పలు కట్టడి చర్యలు చేపట్టినా లాక్‌డౌన్‌కు ఎక్కువ సమయం తీసుకుంది. మాస్కోలో చాలా ఆలస్యంగా మార్చి 30 నుంచి లాక్‌డౌన్ ప్రారంభమైంది. మార్చిలో పలువురు చైనా విద్యార్థుల్ని క్వారంటైన్ చేయగా వారు దాన్ని పట్టించుకోకుండా తిరిగారు. ఆ తర్వాత 200 మంది వరకు రష్యా పౌరులు సైతం స్వదేశంలో క్వారంటైన్ పాటించకుండా బయట తిరుగుతూ పోలీసులకు చిక్కారు. ఇలాంటివన్నీ కలిసి కేసులు ఇంతలా పెరిగిపోయాయి.
బాధితులను తీసుకెళ్తున్న అంబులెన్సులు బాధితులను తీసుకెళ్తున్న అంబులెన్సులు సన్నద్ధతపైనా సందేహాలు
దేశంలో ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు చేసినట్టు రష్యా ప్రభుత్వం ప్రకటించినా వాటి విశ్వసనీయతపై అనుమానాలున్నాయి. 40 వేల వెంటిలేటర్లు ఉన్నట్టు అధికారులు చెబుతున్నా.. వాటిలో 58 శాతం 9 ఏళ్లకు పైబడినవే. ఎప్పటికప్పుడు మార్చాల్సిన ఆక్సిజన్ సెన్సర్ వంటి ఉపకరణాలెన్ని అందుబాటులో ఉన్నాయో చెప్పడం లేదు. అధ్యక్షుడు పుతిన్ హయాంలో దేశం ఆర్థికంగా, సైనికంగా బలపడినా వైద్యం విషయంలో నిర్లక్ష్యానికి గురయిందన్న వాదనలున్నాయి. 2012 తర్వాత అక్కడ ఆసుపత్రుల్లో సిబ్బందిని ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. ఫలితంగా ప్రస్తుత విపత్తు వేళ ఉన్న కొద్దిపాటి సిబ్బందిపై ఒత్తిడి పెరిగిపోయింది. ఇప్పుడక్కడ వైద్య విద్యార్థులే కరోనా రోగుల చికిత్సలో కీలకంగా మారారు. ఎప్పుడూ విపత్తు సమయాల్లో కీలక నిర్ణయాలతో పరిస్థితిని చక్కబెట్టే పుతిన్ ప్రస్తుతం కరోనా కట్టడి విషయంలో చురుగ్గా వ్యవహరించడం లేదన్న విమర్శలు ఎక్కువయ్యాయి.
వైరస్ నివారణకు మందు పిచికారి చైనా తీరుతో ఉద్రిక్తత
చైనాతో ఉన్న సరిహద్దును ఏప్రిల్ 7న రష్యా మూసివేసింది. అప్పటికే 2 వేల మందికి పైగా చైనీయులు రష్యా నుంచి సరిహద్దులోని చైనా పట్టణం షుపెన్షా మీదుగా స్వదేశానికి చేరుకున్నారు. ఈ క్రమంలో షుపెన్షా హాట్‌స్పాట్‌గా మారింది. తమ దేశంలో కొవిడ్ వ్యాప్తిని నియంత్రించగలిగినా, ఇప్పుడు రష్యా నుంచే అధికంగా కేసులు వస్తున్నాయంటూ చైనా నసుగుతోంది. అదే సమయంలో సరిహద్దులో నిలిచిపోయిన వందలాది చైనీయులను స్వదేశంలోకి అనుమతించేందుకు ససేమిరా అంటోంది. ఈ పరిస్థితి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచుతోంది.
ఇదీ చదవండి:కరోనా నిర్ధరణకు సత్వర పరీక్షల సత్తువెంత?